పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్...బండిపై కేటీఆర్‌, ఓవైసీ ఎదురుదాడి

November 25, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు అభివృద్ధి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా అధికార, ప్రతిపక్షాల మద్య యుద్ధం జరిగింది. కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం చిలుకానగర్‌లో ఎన్నికల ప్రచారంలో “మేము గెలిచి మేయర్ పదవి దక్కించుకొంటే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపి అక్కడ దాక్కొన్న రోహ్యింగాలను, పాకిస్తానీలను తరిమితరిమి కొడతామని” హెచ్చరించడంపై మంత్రి కేటీఆర్‌, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు చాలా తీవ్రంగా స్పందించారు. 

మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “చూశారా... ఆయన మతిలేని మాటలు?వాళ్ళు గెలిస్తే హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయిస్తామని బెదిరిస్తున్నారు. హైదరాబాద్‌ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా?బంగ్లాదేశ్‌లో ఉందా?భారతదేశంలోనే కదా ఉంది? మన నగరంపైన, మన ప్రజలపైనే బిజెపి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తానంటోంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇటువంటి మతిలేనివాళ్ళను గెలిపిస్తే నగరం ఏమవుతుందో అందరూ ఆలోచించాలి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో మళ్ళీ అల్లకల్లోలం అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయవంటిది. హైదరాబాద్‌కు ఏమైనా అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. కనుక తమ రాజకీయ లబ్ది కోసం ప్రజల మద్య మత చిచ్చుపెట్టాలనుకొంటున్న ఇటువంటివారిని, పార్టీలను ఈ ఎన్నికలలో ఓడించి మన నగరాన్ని...రాష్ట్రాన్ని కాపాడుకోవాలి,” అని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “బిజెపిని గెలిపిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తానని హెచ్చరిస్తున్నారు. పాతబస్తీ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా? బంగ్లాదేశ్‌లో ఉందా? ఇక్కడ ఉన్నవారు భారతీయులు కారా? మరి సొంత పౌరులపైనే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బెదిరించడం ఏమిటి? ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి చెందినవారైనా ఈ దేశంలో పుట్టినవారందరూ భారతీయులే. పాతబస్తీలో ఉన్నవారందరూ కూడా భారతీయులే. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తుంటే బిజెపి చూడలేకపోతోంది. అందుకే ఇటువంటి దుసాహసానికి సిద్దం అవుతోంది. అయితే బిజెపి బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరు. మేము కూడా అంతే ధీటుగా దానికి బదులివ్వగలం. పాతబస్తీలో రోహ్యింగాలు, పాకిస్తానీలు ఉన్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో... ఎంతమంది ఉన్నారో చెప్పాలి. అయినా పాతబస్తీలో రోహ్యింగాలు, పాకిస్తానీలు ఉంటే మరి కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏమి చేస్తున్నారు? ఇంతకాలం ఎందుకు ఊరుకొన్నారు? వెంటనే వారిని గుర్తించి పంపించివేయొచ్చు కదా?ఈ ఎన్నికలలో గెలిచేందుకు బిజెపి ఇంత నీచానికి దిగజారుతుందనుకోలేదు. ఇటువంటి పార్టీకి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పాలి,” అని అన్నారు.


Related Post