కాంగ్రెస్‌ వెనకబాటుపై రేవంత్‌ రెడ్డి తాజా వ్యాఖ్యలు

November 24, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఇవాళ్ళ సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ డ్‌ ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “టిఆర్ఎస్‌, మజ్లీస్, బిజెపి మూడు పార్టీలు పైకి ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నప్పటికీ, వాటి మద్య బలమైన అనుబందం, రహస్య అవగాహన ఉన్నాయి. ఆ మూడు పార్టీలు కలిసి   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓ పద్దతి ప్రకారం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సినిమాలలో దొమ్మీలు సృష్టించి అమాయకులను బలిగొన్నట్లు, మూడు పార్టీలు కలిసి ‘రాజకీయ దొమ్మీ వాతావరణం’ సృష్టించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ అది వాటి వలన కాదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలద్రొక్కుకొని ఆ మూడు పార్టీలను ఢీ కొని నిలుస్తుంది. ఎప్పటికైనా ఇక్కడ టిఆర్ఎస్‌కు, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే,” అని అన్నారు. 

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిలు గట్టిగా పోటీ పడటం వలన ఆ రేసులో కాంగ్రెస్‌ వెనుకబడిపోయింది. అయితే అందుకు టిఆర్ఎస్‌-బిజెపిలను నిందించి ప్రయోజనం లేదు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకబడిపోయిందో ఆ పార్టీ నేతలే ఆలోచించుకొని, అక్కడ జరిగిన లోపాలను గుర్తించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పునరావృతంకాకుండా సరిచేసుకొని ఉండాలి. కానీ చేసుకొన్నట్లు లేదు. అందుకే ఈ ఎన్నికలు కూడా టిఆర్ఎస్‌-బిజెపిల మద్య పోరుగా మారాయి. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో రాష్ట్ర బిజెపి నేతలు దూసుకుపోతుండటం కూడా కాంగ్రెస్‌ వెనకబాటుకు ఓ కారణంగా కనిపిస్తోంది. 

టిఆర్ఎస్‌-మజ్లీస్-బిజెపిలు కలిసి రాజకీయ దొమ్మీ వాతావరణం సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ గుర్తించినప్పుడు దాని నుంచి ఏవిధంగా తప్పించుకోవాలి? బిజెపి ఆక్రమించిన తన 2వ స్థానాన్ని మళ్ళీ ఏవిధంగా దక్కించుకోవాలి. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఆ మూడు పార్టీల ఎత్తుగడలను ఏవిధంగా తిప్పికొట్టాలి?అని కాంగ్రెస్ వ్యూహకర్తలే ఆలోచించుకోవలసి ఉంది. ఒకవేళ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయినా పరువాలేదు కానీ తప్పనిసరిగా తన ఉనికిని చాటుకోవాలి లేకుంటే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు బిజెపి మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని ప్రజలు కూడా భావించడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా దయనీయంగా మారవచ్చు. 


Related Post