త్వరలో జైలు నుంచి శశికళ విడుదల...అన్నాడీఎంకేలో గుబులు

November 19, 2020


img

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27వ తేదీన బెంగళూరులోని అగ్రహార జైలు నుంచి విడుదలకాబోతున్నారు. నిజానికి ఆమె ఫిబ్రవరి 15వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ జైలులో సత్ప్రవర్తనతో మెలిగినవారిని ముందుగా విడుదల చేస్తారు. అయితే ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినందున ముందుగా విడుదల చేయాలంటే రూ.10.10 కోట్లు జరిమానా చెల్లించాలని బెంగళూరు కోర్టు ఆదేశించడంతో ఆమె అందుకు సిద్దమయ్యారు. 

ఆమె ఆదేశాల మేరకు ఆమె తరపున అడ్వకేట్ రాజా చెందూర్ పాండియన్ బుదవారం రూ.10.10 కోట్లు డీడీ రూపంలో న్యాయమూర్తికి అందించి రశీదు తీసుకొన్నారు. దానిని నిన్ననే అగ్రహార జైలు అధికారులకు అందజేశారు. శశికళ తరపున కోర్టుకు జరిమానా చెల్లించినందున జనవరి 27వ తేదీన ఆమెను జైలు నుంచి విడుదల చేయబోతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. 

ఆమె జైలు నుంచి విడుదలవుతున్నారని తెలియగానే తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలలో గుబులు మొదలైంది. ఆమె విడుదలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందిస్తూ, “శశికళ విడుదలైనప్పటికీ మా పార్టీపై ఎటువంటి ప్రభావం చూపదు. మా పార్టీలో ఎవరూ ఆమెను చూసి భయపడటం లేదు,” అని అన్నారు. శశికళను చూసి భయపడకపోతే ఆమె విడుదలపై ఓ ముఖ్యమంత్రి ఈవిధంగా స్పందించవలసిన అవసరమే లేదు. 

ఆమె జైలుకు వెళ్ళేటప్పుడు తన నెచ్చెలి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిపై గట్టిగా మూడుసార్లు చరిచి ఏదో శపధం చేశారు. బహుశః తనకీ దుస్థితి కల్పించిన అన్నాడీఎంకే అధినేతలపై ప్రతీకారం తీర్చుకొంటానని శపధం చేసి ఉండవచ్చునని అందరూ భావిస్తున్నారు. బహుశః ఆమె మళ్ళీ అన్నాడీఎంకే పార్టీని, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. దాని కోసం ముందుగా అన్నాడీఎంకే పార్టీని నిలువునా చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించవచ్చు లేదా కొత్త పార్టీ పెట్టి వచ్చే ఏడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలలో అన్నాడీఎంకేను ఢీకొనవచ్చు. బహుశః అందుకే అన్నాడీఎంకే నేతలు ఆమెను చూసి భయపడుతున్నారేమో? ఏదిఏమైనప్పటికీ ఇక నుంచి అన్నాడీఎంకే పార్టీకి దినదినగండమే.


Related Post