కాశ్మీర్ అశాంతికి మూలకారణం ఏమిటి?

September 03, 2016


img

కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లు చూసి దేశప్రజలు అందరూ నిట్టూర్పులు విడుస్తున్నారు. అక్కడ మళ్ళీ ఎప్పటికైనా శాంతి నెలకొంటుందా? దివిపై వెలసిన స్వర్గం వంటి కాశ్మీరులో ఎప్పటికైనా మళ్ళీ కాలు పెట్టగలమా? అని బాధ పడుతుంటారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితి ఏర్పడటానికి ఒక్కటి కాదు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 1. పాక్ కుట్రలు 2. వేర్పాటువాదం 3. వేర్పాటువాదుల ప్రాపకం కోసం అర్రులు చాచే రాజకీయ నేతలు 4. జమ్మూ కాశ్మీర్ ప్రజలలో జాతీయ భావం పెంపొందించడంలో పాలకుల నిర్లక్ష్యం 5. ఉగ్రవాదుల దాడులు 6. ఆ కారణంగా నిత్యం సైనికుల మధ్యనే జీవితం గడపవలసిరావడం చేత ప్రజలలో అభద్రతా భావం, ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోవడం ఇలాగ చెప్పుకొంటూపోతే చాలా కారణాలే కనబడతాయి.

అయితే ఈ సమస్యలకి మూల కారణాలు రెండే కనిపిస్తున్నాయి. 1. పాక్ కుట్రలు 2. వేర్పాటువాదం. ఈ రెంటి నుంచే మిగిలినవన్నీ పుట్టుకొచ్చాయి. గత నెలన్నర రోజులుగా కాశ్మీరులో అల్లర్లు జరగడానికి, 70మంది యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఆ రెండే కారణాలని అందరికీ తెలుసు.

కనుక ఆ రెండు సమస్యలని పరిష్కరించనంత కాలం కాశ్మీర్ సమస్యని శాశ్వతంగా పరిష్కరించడం అసాధ్యమేనని చెప్పక తప్పదు. సరిహద్దుల వద్ద గస్తీ పెంచో లేకపోతే చైనాలాగ గోడ కట్టేసుకొనో పాకిస్తాన్ న్ని అడ్డుకోవచ్చు. కానీ ఇంటి దొంగలని ఈశ్వరుడైన పట్టుకోలేడన్నట్లుగా కాశ్మీర్ లో తిష్టవేసుకొన్న వేర్పాటువాదులని నియంత్రించనంత వరకు వారు పాక్ సహకారంతో కాశ్మీర్ లో చిచ్చుపెడుతూనే ఉంటారు.

రేపు కాశ్మీర్ సమస్యపై మళ్ళీ అఖిలపక్ష సమావేశం జరుగబోతోంది. దానిలో 20 రాజకీయ పార్టీల ప్రతినిధులు, 10 మంది స్థానిక ప్రముఖులు పాల్గొనబోతున్నారు. కానీ ఆ సమావేశంలో పాల్గొనవద్దని కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ అధినేత సయ్యద్ అలీ షా గిలానీ పిలుపునిచ్చారు. అంటే కాశ్మీర్ లో శాంతి ఏర్పడటం ఆయనకి ఇష్టం లేదని అర్ధం అవుతూనే ఉంది.

అంత బహిరంగంగా తన మనసులో మాటని చెపుతున్న గిలానీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటే, ఇంక ఇటువంటి అఖిలపక్ష సమావేశాలు ఎన్ని నిర్వహిస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో విధంగా ఇప్పుడు కాశ్మీర్ సమస్యని పరిష్కరించవచ్చు కానీ గిలానీ వంటి వేర్పాటువాదులు మళ్ళీ ఏదో ఒకరోజు కాశ్మీర్ లో ప్రజలని రెచ్చగొట్టకుండా ఊరుకొంటారా? అంటే కాదనే అర్ధం అవుతుంది. కనుక ఈ సమస్యకి మూలకారణం అయిన గిలానీ వంటి వేర్పాటువాదులని నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణచివేయకతప్పదు. కాశ్మీరులో ప్రవేశిస్తున్న ఉగ్రవాదులని ప్రభుత్వం ఏవిధంగా ఏరిపారేస్తుందో అదే విధంగా గిలానీ వంటి కరడుగట్టిన వేర్పాటువాదులని కూడా ధైర్యంగా ఏరిపారేసినప్పుడే కాశ్మీర్ లో శాంతి ఏర్పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి భయపడుతున్నంత కాలం ఇలాగే సమస్యలు సృష్టిస్తుంటారు. 


Related Post