రైతువేదికలు రైతుల సమైఖ్యతకు చిహ్నం: కేసీఆర్‌

October 31, 2020


img

సిఎం కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం జనగామ జిల్లాలోని కొడకండ్ల గ్రామంలో నిర్మించిన రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి మార్కెట్ యార్డులో రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలు చూసి చూసి నేను కన్నీళ్ళు పెట్టుకొన్న సందర్భాలు కోకొల్లలు. అందుకే ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టగానే రైతుల సంక్షేమం కోసం పెద్దా ఎత్తున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. వాటిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 2,601 ఈ రైతువేదికలను నిర్మిస్తున్నాము. వాటిలో ఇప్పటికే 95 భవనాలు పూర్తయ్యాయి. త్వరలోనే మిగిలినవీ పూర్తవుతాయి. రైతువేదికలు నా చిరకాల స్వప్నం. వీటిని ఏదో ఆషామాషీగా నిర్మించడం లేదు. వీటి నిర్మాణం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

ఇప్పటి వరకు అసంఘటితంగా ఉన్న రాష్ట్రంలోని రైతులందరినీ సంఘటిత పరిచి, వారి ఉత్పత్తులకు వారే ధరలు నిర్ణయించుకొనేందుకు ఈ రైతువేదికలు తోడ్పడతాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి రైతులు కూర్చొనిమాట్లాడుకొనేందుకు ఇటువంటి వేదికలు నిర్మించలేదు. ఈ రైతువేదికలలో కూర్చొని ఎప్పుడు ఏ పంటలు వేయాలి?నిత్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, పంటల ధరలు మొదలైన ప్రతీ విషయం గురించి మాట్లాడుకొని రైతులే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రైతువేదికలే రైతులకు శిక్షణ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. వాటిలో ఏర్పాటుచేయబోయే టీవీలలో వ్యవసాయానికి సంబందించి ప్రతీ విషయమూ తెలియజేస్తూ ఆన్‌లైన్‌ పాఠాలను కూడా ప్రసారం చేస్తాము. అలాగే స్మార్ట్ ఫోన్స్ ద్వారా కూడా రైతులు విషయసేకరణ చేసి రైతువేదికలలో కూర్చొని సాటి రైతులతో చర్చించుకోవచ్చు. అలాగే దేశంలో...రాష్ట్రంలో మార్కెట్ల పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయి... ఏ పంటలకు ఎంత ధర పలుకుతోంది?ఏ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉంది? పంటలకు విత్తనలు, ఎరువులు, చీడపీడల నివారణకు పురుగుల మందులు వినియోగం ఇలా ప్రతీ అంశం గురించి వ్యవసాయ అధికారులు వచ్చి రైతువేదికలలో రైతులకు శిక్షణ ఇస్తుంటారు. ఈవిధంగా రైతులు సంఘటితం కాగలిగితే అప్పుడు వారిని ఎవరూ మోసం చేయలేరు. వారి ఉత్పత్తులకు వారే ధరలు నిర్ణయించుకోవచ్చు. అప్పుడు మన రైతులు బంగారం పండించగలరు,” అని అన్నారు.


Related Post