సర్ధార్ పటేల్‌కు ప్రధాని మోడీ ఘననివాళి

October 31, 2020


img

దేశ తొలి హోంమంత్రి సర్ధార్ వల్లబ్‌భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా నివాళి అర్పించారు. గుజరాత్‌ ప్రభుత్వం నర్మదా జిల్లాలోని కేవడియాలో ఐఖ్యతా శిల్పం (యూనిటీ స్టాచ్యూ) పేరిట 597  అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోకెల్ల అత్యంత ఎత్తైన విగ్రహమది. ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ్ళ అక్కడే సర్ధార్ పటేల్‌కు నివాళి అర్పించారు.

అనంతరం అక్కడే సమీపంలో 17 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్యవనాన్ని ప్రారంభించారు. దానిలో 380 రకాలకు చెందిన 5 లక్షల ఔషద మొక్కలను పెంచుతున్నారు. అందుకే దానికి ‘ఆరోగ్యవనం’ అని పేరు పెట్టారు. ఆ తరువాత అక్కడే రెండు అంతస్తులలో ఏర్పాటు చేసిన చేనేత, చేతి వృత్తులతో తయారైన ఉత్పత్తులను అమ్మే ‘ఏక్తామాల్’ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన చిన్నారుల పౌషికాహార్ పార్కును, సమీపంలో 375 ఎకరాలలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ (జూ పార్క్)లను కూడా ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమాలకు హాజరైనవారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ఆనాడు పుల్వామా దాడిలో 40 మంది సైనికులను కోల్పోయామని వారి కుటుంబాలతో సహా యావత్ దేశం ఆవేదన చెందుతుంటే, కొన్ని ప్రతిపక్షపార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆ ఘటన గురించి చాలా దారుణంగా మాట్లాడాయి. రాజకీయాలు చేశాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలపై కూడా భారతీయుల మనసులు చాలా గాయపడేలా చాలా దారుణంగా మాట్లాడాయి. కానీ ఇప్పుడు పుల్వామా దాడులు మేమే చేశామని పాకిస్థాన్‌ మంత్రి స్వయంగా వారి పార్లమెంటులోనే ప్రకటించి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకొన్నారు. దాంతో ఆనాడు మన ప్రతిపక్షాల చేసిన వాదనలు, ఆరోపణలు అన్నీ తప్పని, అవి కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అంత నీచంగా మాట్లాడాయని స్పష్టమైంది. ఇకనైనా దేశభద్రతకు సంబందించిన విషయాలపై రాజకీయాలు చేయవద్దని వారికి మనవి చేస్తున్నాను,” అని అన్నారు. 


Related Post