కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలిస్తే మళ్ళీ టిఆర్ఎస్‌లోకే: కిషన్ రెడ్డి

October 31, 2020


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు నాణేనికి బొమ్మబొరుసుల వంటివి. కనుక టిఆర్ఎస్‌కు ఓట్లు వేసినా కాంగ్రెస్ పార్టీకి వేసినా ఒక్కటే. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచినవారిలో చాలామంది టిఆర్ఎస్‌లో చేరిపోవడం అందరూ చూశారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపిస్తే ఆయన కూడా టిఆర్ఎస్‌లో చేరిపోవడం ఖాయం. కనుక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావును గెలిపించి శాసనసభలో మీ గొంతు వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ టికెట్ కేటాయించకపోవడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించుకొని పోటీ చేస్తున్నారు. కనుక ఒకవేళ ఆయన ఈ ఎన్నికలలో గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారా లేదా మళ్ళీ టిఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతారా?అనే విషయం పిసిసి పెద్దలకు తెలిసి ఉండాలి. ఆయన ఎన్నికలలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారనే నమ్మకంతోనే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఆయన తరపున దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన గెలుపు కోసం చాలా కృషి చేస్తున్నారు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలిచి, ఆయన మళ్ళీ టిఆర్ఎస్‌ గూటికే చేరుకొంటే, కాంగ్రెస్‌ నేతలు టిఆర్ఎస్‌లో చేరబోయే చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం ప్రచారం చేసి గెలిపించి పంపించినట్లవుతుంది. అప్పుడు వారి శ్రమ అంతా వృధా అవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఇంకా తగ్గిపోతుంది. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓడిపోయినా చెరుకుతో ఆ నష్టం భర్తీ అయిపోతే టిఆర్ఎస్‌కు ఎటువంటి తేడా ఉండదు. ఇదే కనుక జరిగితే ఈ ఉపఎన్నికల తరువాత వెంటనే జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై ఈ ప్రభావం చాలా ఉంటుంది. కనుక కిషన్ రెడ్డి వాదనలను తేలికగా కొట్టిపడేయలేము. 


Related Post