పుల్వామా దాడి మాపనే...తూచ్! కాదు: పాకిస్థాన్‌

October 30, 2020


img

2019, ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత ఆర్మీవాహనాలపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఇది పాక్‌ ఉగ్రవాదులపనే అని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది. కానీ పాక్‌ దానిని ఖండించింది. భారత్‌లో ఎప్పుడు ఎక్కడ ఏ దాడి జరిగిన పాకిస్థాన్‌ను వేలెత్తి చూపి నిందించడం భారత్‌కు దూరాలవాటుగా మారిపోయిందని విమర్శించింది. 



అయితే అది మా పనే అని పాక్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాడ్ చౌదరి గురువారం పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. “భారత్‌ భూభాగంలో ప్రవేశించి మరీ భారత్‌ను దెబ్బకొట్టాము.. ఇది ఇమ్రాన్ ఖాన్‌ నేతృత్వంలో పాకిస్థాన్‌ సాధించిన ఘనవిజయం,” అని పొగుడుకొన్నారు కూడా. ఆయన మాటలు విని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, విదేశాంగ మంత్రి ఖురేషీ తదితరులు తలపట్టుకొన్నారు. సభలో తీవ్ర కలకలం చెలరేగడంతో తాను నోరు జారానని మంత్రి ఫవాడ్ చౌదరి గ్రహించారు. 

వెంటనే మాట మార్చి, “నేను పుల్వామా దాడి తదనంతర పరిణామాల గురించి మాట్లాడితే తప్పుగా అర్ధం చేసుకొన్నారు. పుల్వామా దాడి అనంతరం మన వాయుసేన భారత్‌ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేసింది. నేను దాని గురించే చెప్పాను. పుల్వామాలో అమాయకులను (సైనికులను) చంపడం గొప్పవిషయంగా భావించడం లేదు. పాకిస్థాన్‌ ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది,” అని సర్ది చెప్పుకొన్నారు. 

అయితే నిజమేమిటో అందరికీ తెలుసు. ఆనాడు పుల్వామా దాడి తరువాత భారత్‌ వాయుసేన పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌లోకి ప్రవేశించి అక్కడి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చింది. కానీ భారత్‌ వాయుసేన తమ భూభాగంలోకి ప్రవేశించనేలేదని, ఒకవేళ ప్రవేశించి ఉంటే గట్టిగా బుద్ధి చెప్పేవాళ్ళమని పాకిస్థాన్‌ తన అసమర్ధతను కప్పుపుచ్చుకొంది. 

ఆ తరువాత భారత్‌ వాయుసేన బాలాకోట్‌లో వేసిన బాంబులకు అనేక చెట్లు నేలకూలాయని, దాని వలన తమకు చాలా పర్యావరణనష్టం జరిగిందని వాదించడం ద్వారా పాక్‌ మళ్ళీ దొరికిపోయింది. ఆ ఘటన తరువాత పాక్‌ కూడా భారత్‌ భూభాగంలో దాడులు చేయడానికి యుద్ధవిమానాలను పంపించిన మాట వాస్తవం. కానీ అవి భారత్‌ సరిహద్దులకు చేరుకోగానే అప్రమత్తమైన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వాటిని వెంటాడి వాటిలో అత్యాధునాతమైన ఎఫ్-16 విమానాన్ని నేలకూల్చేశారు. ప్రతిదాడిలో ఆయన నడిపిస్తున్న మిగ్-21 యుద్ధవిమానం పాక్‌ భూభాగంలో కూలిపోయిన మాట వాస్తవం. భారత్‌ దానిని దృవీకరించింది కూడా. కానీ పాక్‌ మాత్రం ఎఫ్-16 యుద్ధవిమానం కూలిపోయినట్లు అంగీకరించలేదు. ఒకవేళ ఒప్పుకొంటే అమెరికాకు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది కనుక అసలు ఎఫ్-16 విమానాన్ని వినియోగించనేలేదని మరోసారి పాక్‌ ప్రభుత్వం బుకాయించింది. 

మంత్రి ఫవాడ్ చౌదరి చెప్పినట్లు ఒకవేళ పాక్‌ వాయుసేన భారత్‌ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయడం నిజమే అయితే, ఎఫ్-16 యుద్ధవిమానం కూలిపోవడం కూడా నిజమేనని అంగీకరించవలసి ఉంటుంది. కానీ పాక్‌ అంగీకరించడం లేదు కనుక ఆయన పుల్వామా దాడి గురించే మాట్లాడారని తేటతెల్లమవుతోంది. అయినా ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకు అన్నట్లు, జగమంతా ఎరిగిన పాక్‌ వక్రబుద్దికి మళ్ళీ సాక్ష్యాధారాలు ఎందుకు? 


Related Post