ఆ రెండు ప్రశ్నలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సమాధానాలు ఉన్నాయా?

September 02, 2016


img

దేశవ్యాప్తం నేడు కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జరుగుతోంది. కనీస వేతనాలు వగైరా కొన్ని డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె కారణంగా దేశంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఈ సమ్మె వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి కార్మికుల డిమాండ్లని పరిష్కరిస్తాయో లేదో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ సమ్మె సందర్భంగా చాలా ఆలోచించవలసిన రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి అందరికీ తెలిసినవే కానీ వాటిపై కార్మికుల కోణంలో నుంచి ఎవరూ ఆలోచించే ప్రయత్నం చేసినట్లు కనబడదు.

1. కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనేందుకే ప్రభుత్వ రంగ సంస్థలో తన వాటాలని విక్రయించుతోంది.

2. బ్యాంకులు దివాళా తీయడానికి ప్రధాన కారణం సామాన్య ప్రజలు కాదు. వేలకోట్లు అప్పులు తీసుకొని ఎగవేస్తున్న బడా పారిశ్రామిక వేత్తలే.

ఈ రోజు సమ్మెలో పాల్గొన్న వారిలో చాలా మంది ప్రధానంగా ఈ రెండు అంశాలని ప్రస్తావించి తమ వాదనలని వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక లోటుని భర్తీ చేసుకోవడానికి డిజిన్వేస్ట్మెంట్ ఒక మార్గంగా ఎంచుకోవడంపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ఆ విధానం వలన భారీగా ఆదాయం సమకూర్చుకోగలదు కానీ దాని వలన మంచి లాభాలతో నడుస్తున్న బంగారు బాతుల వంటి ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా కార్పోరేట్ సంస్థల చేతిలోకి వెళ్లిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆ సంస్థలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని సమ్మెలో పాల్గొంటున్న ఆందోళనకారులు వాదిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీలకి ఎర్ర తివాచీలు పరిచి, లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలని బంగారు పళ్ళెంలో పెట్టి అందించవలసిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కార్పోరేట్ సంస్థల పట్ల అంత ఉదారంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాన్య కార్మికులకి కనీస వేతనాలు, కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు వెనుకాడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, బ్యాంకింగ్, జీవిత భీమా, విద్యుత్, రైల్వే, రవాణా మొదలైన రంగాలలో విదేశీ కంపెనీలు ప్రవేశించనిస్తే దీర్ఘకాలంలో దేశానికి చాలా చేటు కలిగిస్తాయని వారు వాదిస్తున్నారు.

విజయ్ మాల్యా, కావూరి సాంబశివరావు, సుజనా చౌదరి వంటి ప్రముఖులు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొని ఎగవేస్తుండటం వల్లనే  బ్యాంకులు తీవ్ర నష్టాలలో కూరుకొని పోయి చివరికి దివాళా తీస్తున్నాయని ఆందోళనకారులు వాదిస్తున్నారు. సామాన్య ప్రజలు, రైతుల వలన కాకుండా ఇటువంటి బడాబాబుల నిర్వాకం వల్లనే బ్యాంకులు దివాళా తీస్తున్నాయని వాదించారు. సామాన్యులు రుణాలు చెల్లించలేకపోతే వారి ఆస్తులు కూడా జప్తు చేయడానికి వెనుకాడని బ్యాంకులు తమని నిలువునా ముంచేస్తున్నా ఈ బడాబాబులని ఎందుకు ఉపేక్షిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.

కార్మికులు అడుగుతున్న ఈ రెండు ప్రశ్నలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పగలవా?


Related Post