దుబ్బాకలో గెలుపు ఏ పార్టీకి ఎంత లాభం?

October 24, 2020


img

నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నికలు జరుగనున్నాయి. టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి మూడు ప్రధాన పార్టీలు గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ  ఉపఎన్నికల ప్రభావం ఆ తరువాత వరుసగా జరుగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలలో ఎంతోకొంత ఉంటుంది. కనుక మూడు పార్టీలలో ఏది గెలిచినా మిగిలిన రెంటికీ తరువాత జరిగే ఎన్నికలలో ఎదురీత తప్పదు. 

‘ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత భారీ మెజార్టీతో గెలవడం ఖాయం,’ అని మంత్రి హరీష్‌రావు నమ్మకంగా చెపుతున్నారు. ఒకవేళ ఆమె గెలిస్తే రాష్ట్ర ప్రజలందరూ తమ ప్రభుత్వ పనితీరుపట్ల సంతృప్తిగా ఉన్నారని టిఆర్ఎస్‌ గట్టిగా చెప్పుకొనే అవకాశం ఉంది. 

ఒకవేళ కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలిచినట్లయితే, ఇది కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలుగుతుంది.  

అదే బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు గెలిచినట్లయితే, తెలంగాణలో టిఆర్ఎస్‌కు బిజెపి మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని, రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకొందని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పుకోగలుగుతుంది. 

ఒకవేళ ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓడిపోతే అది ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే టిఆర్ఎస్‌కు చెందిన ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోలేకపోవడం, తరువాత జరుగబోయే వరుస ఎన్నికలకు ముందు ప్రత్యర్ధుల చేతిలో ఓటమి రెండూ టిఆర్ఎస్‌కు మంచివి కావు. 

ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు ఓడిపోతే వాటికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ ఈ ఓటమి వాటి ఉత్సాహాన్ని నీరుగార్చే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా తరువాత జరుగబోయే వరుస ఎన్నికలలో ప్రజలను మెప్పించడం ఇంకా కష్టం కావచ్చు.


Related Post