భారత్‌ పట్ల ట్రంప్‌కు అంత చులకనభావమా?

October 24, 2020


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్‌ పట్ల చాలా చులకనభావం ఉందనే సంగతి రహస్యమేమీ కాదు. ఆ విషయం ఆయనే పలుమార్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెపుతూనే ఉన్నారు. నవంబర్‌ 3న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆనవాయితీ ప్రకారం ఇద్దరు అధ్యక్ష అభ్యర్ధులు డోనాల్డ్ ట్రంప్‌, జో బిడెన్‌ మద్య నాష్ వేలీలో గురువారం రాత్రి ముఖాముఖీ చర్చ జరిగింది. 

ఆ సందర్భంగా పర్యావరణం అంశంపై జరిగిన చర్చలో డోనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ, “భారత్‌లో వాయుకాలుష్యం భరించరాని స్థాయిలో రోత పుట్టించేలా ఉంటుంది. ఒక్క భారత్‌లోనే కాదు చైనా, రష్యాలలో కూడా అంతే. కానీ నా ప్రభుత్వం కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చేపట్టిన పలుచర్యల కారణంగా మన దేశంలో గాలి నాణ్యతగా ఉంది. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాలలో చైనా మొదటిస్థానంలో, భారత్‌ 4వ స్థానంలో నిలిచాయంటే ఆ దేశాలలో వాయుకాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు,” అని అన్నారు. 

నిజమే...భారత్‌ రాజధాని న్యూఢిల్లీతో సహా పలు రాష్ట్రాలలో వాయుకాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న భారత్‌కు అధిక జనాభా, పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, పోష్టికాహారలోపం వంటి అనేకానేక సమస్యలను ఎదుర్కొంటోంది. కనుక దేశంలో కోట్లాదిమంది నిరుపేదల కోసం లక్షల కోట్లు ఖర్చుచేస్తూ సంక్షేమ పధకాలను అమలుచేస్తూనే, మరోపక్క పాకిస్తాన్, చైనాలు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి రక్షణరంగానికి లక్షలకోట్లు కేటాయించవలసివస్తోంది. ఈ రెండు సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తూనే మరోపక్క మౌలికవసతుల కల్పన, అభివృద్ధి పనులకు కూడా నిధులు సమకూర్చుకోవలసి వస్తోంది. ఇన్ని సవాళ్ళ మద్య కూడా భారత్‌ వివిద రంగాలలో అమెరికాతో పోటీ పడేస్థాయికి ఎదిగిందంటే అది మామూలు విషయం కాదు. 

ఇవేవీ ట్రంప్‌కు తెలియవనుకోలేము. కానీ నోటి దురుసు, పొగరుబోతనంతో భారత్‌ గురించి చులకనగా మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు. పర్యావరణ అంశంపై చర్చ జరిగినప్పుడు ట్రంప్‌ అమెరికాకు...అమెరికన్లకు సంబందించి ఏమీ మాట్లాడలేకనే భారత్‌, చైనా, రష్యాలపై నోరు పారేసుకొన్నారని చెప్పకతప్పదు. 

ముఖ్యంగా తాజా సర్వేలలో ప్రవాస భారతీయులు, చైనా దేశస్థులు తనకు వ్యతిరేకంగా మారారని తెలిసినందునే ట్రంప్‌ ఇప్పుడు భారత్‌, చైనాల గురించి చులకనగా మాట్లాడుతున్నారని, తద్వారా అమెరికన్లను ఆకట్టుకోవాలని ప్రయత్నించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా కట్టడిలో విఫలమైన ట్రంప్‌ చైనాను దూషిస్తూ అమెరికన్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లే ఈవిషయంలో కూడా భారత్‌, చైనాల గురించి చులకనగా మాట్లాడారని భావించవచ్చు. ఈ వాదనలు నిజమో కాదో తెలీదు కానీ భారత్‌ పట్ల ట్రంప్‌ ప్రదర్శిస్తున్న ఈ చులకనభావమే ప్రవాసభారతీయులను జో బిడెన్‌ వైపు మొగ్గేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ట్రంప్‌ నోరే ఆయన పతనానికి కారణమైందని రుజువు అవుతుంది.


Related Post