15 రోజుల కోసం రూ.10.10 కోట్లు చెల్లింపుకు రెడీ

October 23, 2020


img

అవును...15 రోజుల కోసం రూ.10.10 కోట్లు చెల్లించడానికి ఆమె సిద్దపడ్డారు. అంటే ఇదేదో వ్యాపారలావాదేవీ అనుకొంటే పొరపాటే. అక్రమాస్తుల కేసులు గత నాలుగేళ్ళుగా బెంగళూరు జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు సంబందించిన వ్యవహారమిది. ఆమె నాలుగేళ్ళ జైలు శిక్ష 2021, ఫిబ్రవరి 14తో పూర్తవుతుంది. కానీ నిబందనల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు నెలకు 3 రోజులు చొప్పున జైలుశిక్ష తగ్గించబడుతుంది. 

‘సత్ప్రవర్తన’ కలిగిన శశికళకు నిబందల ప్రకారం జనవరి నెలాఖరుకి అంటే సుమారు 15 రోజులు ముందుగా జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఆమె నేర తీవ్రత దృష్ట్యా 15 రోజులు ముందుగా విడుదలచేసేందుకు రూ.10.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని జైళ్ళ శాఖ అధికారులు చెప్పారు. అందుకు ఆమె ఏమాత్రం వెనకాడలేదు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు శశికళ సిద్దమయ్యారు. ఈ విషయం ఆమె న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం కోర్టులు దసరా శలవులలో ఉన్నందున తిరిగి తెరుచుకోగానే ఆ సొమ్మును కోర్టులో జమా చేస్తామని చెప్పారు. కనుక కోర్టులు తెరుచుకొన్న తరువాత ఎప్పుడైనా శశికళ విడుదల గురించి శుభవార్త వినిపించే అవకాశం ఉందని పాండ్యన్ చెప్పారు. 

సుమారు రెండేళ్ల క్రితం శశికళ బురఖా వేసుకొని తోటి ఖైదీని వెంటబెట్టుకొని చేతికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని దర్జాగా రోజూ బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకొని తిరిగి వస్తున్నట్లు సాక్షాత్ కర్ణాటక జైళ్ల శాఖ డిజిపియే కర్ణాటక ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పుడు శశికళపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై ఫిర్యాదు చేసిన డీజీపీనే బదిలీ చేసింది. ఈ రెండు ఘటనలను బట్టి శశికళ రాజకీయంగా ఎంత శక్తివంతురాలో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా పరిగణించడం విశేషం.  

దేశంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కూడా తమ జీవితాంతం కష్టపడినా రూ.10.10 కోట్లు పోగేయలేరు. కానీ శశికళ 15 రోజుల జైలుశిక్షను తగ్గించుకోవడం కోసం అంత సొమ్మును చెల్లించేందుకు సిద్దం అంటున్నారు. ఆమె రోజుకు 73 లక్షలు చొప్పున చెల్లించేందుకు సిద్దపడుతున్నారన్న మాట! ఆ లెక్కన ఆమె సంపాదన ఏ స్థాయిలో ఉందో... ఆమె వద్ద ఎన్నివేలకోట్ల ఆస్తి ఉందో ఊహించుకోవలసిందే.


Related Post