దేశంలో తొలి సీ-ప్లేన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

October 23, 2020


img

అభివృద్ధి చెందిన దేశాలలో చాలా కాలం నుంచే నీటిపై నుంచి టేకాఫ్ చేసి మళ్ళీ నీటిపై దిగగల సీ-ప్లీన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే భారత్‌లో కూడా సీ-ప్లేన్స్ ఎగురబోతున్నాయి. ఈనెల 31వ తేదీన సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశంలో తొలి సీ-ప్లేన్ సేవలను ప్రారంభించనున్నారు.  అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం వద్ద నర్మదానదీ తీరం నుంచి బయలుదేరి నర్మదా జిల్లాలో కేవడియా వద్ద నిర్మించిన స్టాచ్యూ  ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహం) వద్దకు చేరుకొంటాయి. ఆరోజు నుంచి ప్రజలకు కూడా స్పైస్ జెట్ విమానసంస్థ అధ్వర్యంలో నడువబోయే ఈ సీ-ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.          

ఈ సీ-ప్లేన్‌లో 12 మంది ప్రయాణించవచ్చు. అహ్మదాబాద్ నుంచి కేవడియాకు రోజుకు నాలుగు సర్వీసులు నడిపిస్తామని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. దీనిలో ప్రయాణించేందుకు ఒక్కో వ్యక్తికి రూ.4,800 ఛార్జీగా నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా అహ్మదాబాద్ నుంచి కేవడియా చేరుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. సీ-ప్లేన్స్ ద్వారా అయితే కేవలం గంటలోపే చేరుకోవచ్చు.   

ఇంతకు ముందు ఏపీలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ జిల్లాలోని భీమిలి నుంచి రాజమండ్రి, విజయవాడ మద్య ఈ సీ-ప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు కానీ చేయలేకపోయారు. ఒకవేళ ఆరంభించి ఉండి ఉంటే ఈ క్రెడిట్ ఆయనకే దక్కేది. 

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌లో తప్ప మరెక్కడా విమానాశ్రయాలు లేకపోవడం చాలా శోచనీయమే. కనుక ఎయిర్ పోర్టులు, రన్‌వేలు అవసరం లేని ఈ సీ-ప్లేన్ సర్వీసులను ప్రవేశపెడితే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయి. రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కదా? కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాత రాష్ట్రంలో చాలా జిల్లాలలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు, పొడవైన కాలువలు ఏర్పాటయ్యాయి. అవి సీ-ప్లేన్స్ టేకాఫ్, ల్యాండింగ్ చేసేందుకు సరిపోతాయనుకొంటే తెలంగాణ ప్రభుత్వం కూడా సీ-ప్లేన్స్ ప్రవేశపెడితే బాగుంటుంది. 


Related Post