బాబు ఉండేది హైదరాబాద్‌లోనే కానీ నోరు మెదపడు: బిజెపి

October 22, 2020


img

“టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉండేది హైదరాబాద్‌లోనే కానీ వరదబాధితుల గురించి ఒక్క ముక్క మాట్లాడడు”, అని ఏపీ బిజెపి ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. “ఇక్కడ ఏపీలో 5 ఏళ్లపాటు దోచుకొని అక్కడకు వెళ్ళి రెస్ట్ తీసుకొంటున్నారు. తండ్రి తాను ఓ మహా మేధావిననుకొంటుంటే, కుమారుడు ఓ స్క్రోలింగ్ వీరుడు. ఎలాగూ ఖాళీగానే ఉంటారు కనుక ఏపీకు రోజుకో లెటర్ పోస్ట్ చేస్తుండటమే ఆయన పని. 2019 ఎన్నికలతోనే టిడిపి తీరందాటి తెలంగాణ చేరింది కనుక ఇక్కడ టిడిపి కధ పూర్తిగా ముగిసిపోయినట్లే. ఇకపై ఏపీలో బిజెపియే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుంది,” అని అన్నారు. 

ఒకప్పుడు హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబునాయుడు పదేపదే గట్టిగా చెప్పేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటున్నా జలమయం అవుతున్న రోడ్లు, కాలనీలు, బస్తీల గురించి ఒక్క ముక్క మాట్లాడటం లేదు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్ళవంటివాని చెప్పుకొన్న చంద్రబాబునాయుడు వరదబాధితులపట్ల కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. చేస్తే ఏమవుతుందో...టిఆర్ఎస్‌, బిజెపిలు ఏవిధంగా స్పందిస్తాయో బాగా తెలుసు. బహుశః అందుకే హైదరాబాద్‌లోనే ఉంటున్నా వరద పరిస్థితి, వరద బాధితుల గురించి చంద్రబాబునాయుడు ఒక్క ముక్క మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారేమో?రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఏపీలో 5 ఏళ్ళు అధికారం చెలాయించి ఓడిపోగానే ఇప్పుడు ఏపీలో కూడా టిడిపి పరిస్థితి దయనీయంగా మారడం ఆశ్చర్యకరమే.


Related Post