తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం

October 21, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో ఓటర్లలో బిజెపిపై వ్యతిరేకత పెంచేందుకు మంత్రి హరీష్‌రావు కేంద్రప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కొంతమంది తెలంగాణ మంత్రులకు కేంద్రాన్ని విమర్శించడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు. కేంద్రం ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి, సంక్షేమ పధకాలకు, ప్రకృతి విపత్తులలో సహాయ, పునరావాస  కార్యక్రమాలకు సొంత నిధులను ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారని, కానీ కేంద్రం ఇచ్చినా రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చినా అది ప్రజల సొమ్మేనని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదంటూ కొందరు మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలకు నిధులు విడుదల చేయడానికి కొన్ని నియమనిబందనలు, విధివిధానాలు ఉంటాయని ఆ ప్రకారమే ఇప్పుడూ కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందిస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. ముందుగా రాష్ట్ర విపత్తు నిధి నుంచి తీసి ఖర్చు చేసుకోవాలని ఆ తరువాత నిపుణులతో కూడిన కేంద్రబృందాలు ముంపు ప్రాంతాలలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనావేస్తాయని, అవి ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికసాయం ప్రకటిస్తుంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఢిల్లీ వచ్చి కేంద్రంతో మాట్లాడి, రాష్ట్రంలో జర్గిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రబృందాన్ని పంపిస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. ఆ బృందం రాష్ట్రంలో పర్యటించి నివేదిక ఇవ్వగానే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తున్నా తెలంగాణ మంత్రులు కేంద్రాన్ని నిందించడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.


Related Post