అప్పుడు కార్మికులను తప్పు పట్టి ఇప్పుడు...

October 21, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్‌ల తీరును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తప్పు పట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం అన్ని రైళ్ళు నడువకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతర్ రాష్ట్ర బస్‌ సర్వీసులపై కేంద్రం నిషేదం ఎత్తివేసినప్పటికీ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పంతాలు, పట్టింపుల వలన ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు.  ఓ వైపు భారీ వర్షాలు, వరదలు మరోవైపు దసరా పండుగ సీజన్ మొదలైపోవడంతో హైదరాబాద్‌, తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి వెళ్లాలనుకొనేవారికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడతారు. కానీ అవి లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయీ. అయినా ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదు. కనుక ఇకనైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల కోసం తమ పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి మాట్లాడుకొని వెంటనే ఆర్టీసీ బస్సులు ప్రారంభించాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

ఏడాది క్రితం సరిగ్గా ఇదే పండుగ సమయంలో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు నిరవదిక సమ్మెను మొదలుపెట్టినప్పుడు, పండుగ సమయంలో సమ్మె మొదలుపెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్లు సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. నష్టాలలో కూరుకుపోయిన టీఎస్‌ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూర్చుకోగల పండుగ సీజనులో సమ్మె చేయడం చాలా బుద్ది తక్కువ పని అని దాని వలన టీఎస్‌ఆర్టీసీ మరింత నష్టాలలో కూరుకుపోతుందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. కానీ ఇప్పుడు పండుగ సీజనులో అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు తిప్పకుండా ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తోంది! ముందు రెండు తెలుగు రాష్ట్రాల మద్య అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభించి ఆ తరువాత రూట్లు, కిలోమీటర్ల లెక్కలు మాట్లాడుకొంటే సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఉండవు కదా?రెండు ప్రభుత్వాల పంతాలు, పట్టింపుల వలన రెండు రాష్ట్రాల ఆర్టీసీలు విలువైన పండుగ సీజను ఆదాయం కోల్పోతుండటడమేకాక ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయిని చెప్పక తప్పదు. 


Related Post