వాళ్ళు గత పాలకులే కదా?

October 20, 2020


img

అంతా సవ్యంగా ఉంటే ఆ ఘనత మాదేనని ఏవైనా లోపాలు బయటపడితే ఆ పాపం గత ప్రభుత్వాలదేనని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తుండటం తరచూ వింటూనే ఉంటాము. మొన్నటివరకు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకొన్న టిఆర్ఎస్‌ మంత్రులు నేతలు, ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి గత ప్రభుత్వాల తప్పిదాల కారణంగానే నగరానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తుండటమే అందుకు తాజా ఉదాహరణ. 

అయితే ఈ ఆరోపణలు చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమైక్య రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కార్మిక, పర్యాటకశాఖల మంత్రిగా చేసారు. ప్రస్తుతం టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ 2014 నుంచి 2018 వరకు టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్‌లో చేరినవారే. టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఇంకా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌, టిడిపిల నుంచి వచ్చినవారే. అటువంటప్పుడు వారు గత ప్రభుత్వాలను విమర్శిస్తుండటం తమను తామే నిందించుకొంటున్నట్లే కదా?అయినా తెలంగాణలో టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్ళయ్యింది. ఇంకా ఎంతకాలం గత ప్రభుత్వాలను నిందిస్తారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేకపోయిన పనులను, తీర్చలేకపోయిన సమస్యలను టిఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తుందని, తీర్చుతుందనే నమ్మకంతోనే ప్రజలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు పట్టం కట్టారు కదా?కానీ నేటికీ చిన్న వర్షం పడితే నగరంలో రోడ్లన్నీ నీళ్ళతో ఎందుకు నిండిపోతున్నాయి? బస్తీలలో ఇళ్లలోకి నీళ్ళు ఎందుకు చేరుతున్నాయి? చెరువుల కట్టలు తెగిపోయి నగరాన్ని ఎందుకు ముంచెత్తుతున్నాయి? అని వరదబాధితులు ప్రశ్నిస్తున్నారు. 

ఇంత అసాధారణమైన స్థాయిలో భారీ వర్షాలు కురిస్తే ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదనేది వాస్తవం. కనుక ఆ నిజాన్ని ఒప్పుకొని ఇప్పుడు కనబడుతున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఆరున్నరేళ్ళ తరువాత కూడా ఇంకా తాము పనిచేసిన గత ప్రభుత్వాలను తామే తిట్టుకొంటే ఏమి ప్రయోజనం. అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కూడా.


Related Post