మంత్రి పదవికి రాజీనామా చేస్తా: హరీష్‌రావు

October 20, 2020


img

అవును.. రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. అయితే ఊరికే కాదు...కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి వేలకోట్లు ఆర్ధికసాయం చేస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరూపిస్తే! 

మంత్రి హరీష్‌రావు సోమవారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రానికి, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపధకాలకు కేంద్రమే నిధులిస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఆ పార్టీ నేతలందరూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కానీ సంక్షేమ పధకాలకు ఒక్క పైసాకూడా ఇవ్వడం లేదు. నేను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. ఒకవేళ నేను తప్పు అని నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే, మంత్రి పదవులకు తక్షణమే రాజీనామా చేస్తాను. లేకపోతే బండి సంజయ్‌ దుబ్బాక బస్టాండ్ వద్ద ముక్కును నేలకు రాసి క్షమాపణనలు చెప్పి తన పదవులకు రాజీనామా చేస్తారా?” అని మంత్రి హరీష్‌రావు సవాలు విసిరారు. 

దుబ్బాక ఉపఎన్నికలలో ఏదోవిధంగా ప్రజలను మభ్యపెట్టి గెలవాలని రాష్ట్ర బిజెపి నేతలు ఇటువంటి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కానీ దుబ్బాక ప్రజలకు ఏవి నిజమో ఏది అబద్దమో బాగా తెలుసు. కనుక ఉపఎన్నికలలో బిజెపికి కొర్రుకాల్చి వాత పెట్టినట్లు బుద్ది చెప్పాలి,” అని అన్నారు. 

ఈ సవాళ్ళు, ప్రతిసవాళ్ళు అన్ని ఓటర్లను ఆకట్టుకొనేందుకే తప్ప వీటివలన ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ లేదని చెప్పక తప్పదు. దుబ్బాక ఉపఎన్నికలు పూర్తయిపోగానే అక్కడ బస చేసిన వివిద పార్టీల నేతలందరూ తిరిగి వెళ్ళిపోతారు. మిగిలేది దుబ్బాక ప్రజలు, వారు ఎన్నుకోబోయే ఎమ్మెల్యే మాత్రమే. ఆ ఎన్నుకొన్న ఎమ్మెల్యే అయినా వారి కష్టాలను తీర్చుతారో లేదో? దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో లేదో తెలియాలంటే మరో కొన్ని నెలలు వేచి చూడక తప్పదు. 



Related Post