దుబ్బాకలో కాంగ్రెస్‌... జీహెచ్‌ఎంసీలో టిఆర్ఎస్‌ నేతలు

October 17, 2020


img

ఒక నష్టాన్ని లాభంగా...ఒక శాపాన్ని వరంగా...ఒక కష్టాన్ని అవకాశంగా మలుచుకోగలిగితే ఆ మనిషికి ఇక తిరుగే ఉండదు. అటువంటి వ్యక్తి సిఎం కేసీఆర్‌...అటువంటి పార్టీ టిఆర్ఎస్‌ అని చెప్పకతప్పదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ రోడ్లు, గల్లీలు చెరువులుగా మారడం, ఇళ్ళలోకి నీళ్ళు చేరి ప్రజలు నానా ఇక్కట్లు పడటం, వరద నీటిలో కొట్టుకుపోయి కొంతమంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం వంటివి ప్రజాగ్రహానికి గురిచేసేవే...ఏ ప్రభుత్వానికైనా తీరని అప్రదిష్ట కలిగించేవే...ప్రతిపక్షాలు విమర్శించేందుకు అవకాశం కల్పించేవేనని అందరికీ తెలుసు. 

ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర ఆగ్రహంతో ఉంటారు కనుక ఎవరూ వారిని పరామర్శించే సాహసం చేయరు. దీనినే ప్రతిపక్షాలు అవకాశంగా భావిస్తుంటాయి కనుక ఆయా ప్రాంతాలలో పర్యటిస్తూ సమస్యలతో సతమతమవుతున్న ప్రజల ఆగ్రహావేశాలను మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం పరిపాటి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌, బిజెపి నేతలందరూ దుబ్బాకలో తిష్టవేసి అక్కడ ఉపఎన్నికలలో గెలుపుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, టిఆర్ఎస్‌ నేతలు హైదరాబాద్‌లోని ఈ విపత్కర పరిస్థితులనే ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఓ గొప్ప అవకాశంగా మలుచుకోవడం గొప్ప విషయం. 

మంత్రి కేటీఆర్‌, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమీషనర్, జోనల్ కమీషనర్ తదితర అధికారులను వెంటబెట్టుకొని ముంపు ప్రాంతాలలో కలియతిరుగుతూ బాధితులను ఓదార్చి వారికి భరోసా కల్పిస్తున్నారు. తద్వారా వారి ఆగ్రహావేశాలను చల్లార్చి వారిలో మళ్ళీ టిఆర్ఎస్‌ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరిగేలా చేస్తున్నారు. కేటీఆర్‌ స్వయంగా మృతుల కుటుంబాలను కలిసి ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు (నష్టపరిహారం) చెక్కులు అందజేస్తున్నారు. వరదలలో ఇళ్ళు కూలిపోయినవారికి ఇళ్ళు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇస్తున్నారు. ముంపు ప్రాంతాలలో సమస్యలను స్వయంగా పరిశీలించి, కొన్ని పనులకు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరికొన్నిటికి అక్కడిక్కడే నిధులు మంజూరు చేసి త్వరలో పనులు మొదలుపెట్టిస్తానని హామీ ఇస్తున్నారు. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు హుటాహుటిన బాధిత కుటుంబాలకు అవసరమైన బియ్యం, పప్పులు, మంచినీళ్లు వగైరా అందజేస్తున్నారు. 

ఇన్ని బాధలు అనుభవించిన తరువాత “జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్‌కు ఎందుకు ఓటేస్తారు?అనే పరిస్థితి నుంచి మన సమస్యల పరిష్కారం కావాలంటే టిఆర్ఎస్‌కే ఓటేయాలి..” అని అనుకొనేలా చేయడం మామూలు విషయం కాదు. ఇది కేవలం సిఎం కేసీఆర్‌,కేటీఆర్‌లకే చెల్లు అని చెప్పక తప్పదు. 

ముంపు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలను రాజకీయాలతో ముడిపెట్టి చూడటం సరికాదు కానీ ఈ పర్యటనల వలన చివరికి జరిగేది అదేనని చెప్పక తప్పదు. 

ముంపు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారని, దాని వలన టిఆర్ఎస్‌కు లబ్ది కలుగుతుందని కాంగ్రెస్‌, బిజెపి నేతలకు తెలిసి ఉన్నప్పటికీ వారు దుబ్బాకకు పరిమితమవడం మరో పెద్ద తప్పు అని చెప్పక తప్పదు. ఎందుకంటే, కేటీఆర్‌ పర్యటనలు ముగిసిన తరువాత వారు తాపీగా ముంపు ప్రాంతాలలో పర్యటిస్తే , కష్టకాలంలో కనిపించకుండా పోయినందుకు ప్రజలు వారిపైనే తిరుగబడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వారు చేయవలసిన పనులను మంత్రి కేటీఆర్‌ చక్కబెట్టేశారు కనుక!


Related Post