ప్రజలకు అభ్యంతరం లేదు...కానీ ప్రభుత్వానికుంది

October 17, 2020


img

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లకు కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అవి ఆన్‌లైన్‌లో అమ్ముతున్న వివిద ఉత్పత్తులు ఏ దేశంలో తయారయ్యాయి? అనే విషయం స్పష్టంగా పేర్కొనాలని కేంద్రప్రభుత్వం గతంలోనే వాటికి సూచించింది. కానీ ఆ సూచనను అవి పట్టించుకోకుండా దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్-గ్రేట్ ఇండియన్ సేల్, అమెజాన్-బిగ్‌బాస్ బిలియన్ సేల్‌ను ప్రారంభించేశాయి. వాటి తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రెండు సంస్థలను 15 రోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపించింది. ఆ రెండు సంస్థలే కాక దేశంలో ఈ కామర్స్ సంస్థలన్నీ తప్పనిసరిగా తమ ఉత్పత్తులు ఏ దేశంలో ఎప్పుడు తయారయ్యాయి వంటి పూర్తి వివరాలను వినియోగదారులకు తెలిసేలా వాటిపై స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది. ఈ కామర్స్ సంస్థలు అమ్ముతున్న మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో చాలా వరకు విదేశీ కంపెనీలవే. అవికాక కొన్ని రకాల విద్యుత్ పరికరాలు, గృహోపకరణాలు కూడా చైనాలో తయారవుతున్నవే.        

కేంద్రప్రభుత్వం స్వదేశీ సంస్థలను ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ‘మేకిన్ ఇండియా’ పధకాన్ని ప్రారంభించింది. ఆ ప్రయత్నాలలో భాగంగానే విదేశీ ఉత్పత్తుల దిగుమతిని కట్టడి చేసేందుకు కొన్నిటిపై భారీగా పన్నులు విధిస్తోంది. దీంతో కొన్ని చైనా కంపెనీలు భారతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని లేదా భారత్‌లో తమ అసెంబ్లింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకొని తమ ఉత్పత్తులను యధాప్రకారం అమ్ముకొంటున్నాయి.    

భారత్‌-చైనా సరిహద్దుల వద్ద ఘర్షణలు మొదలైన తరువాత దేశప్రజలకు ఏవి దేశీయ ఉత్పత్తులో ఏవి చైనా ఉత్పత్తులో స్పష్టంగా తెలియజేయడం ద్వారా చైనా ఉత్పత్తుల కొనుగోలు చేయకుండా నిరుత్సాహపరిచేందుకుగాను కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది. కానీ భారతీయులు చైనా ఉత్పత్తుల పట్లే మోజు చూపుతున్న సంగతి తెలిసిందే. అందుకే చైనా మొబైల్ ఫోన్లు హాట్ కేకుల్లా క్షణాలలో అమ్ముడైపోతున్నాయి. అంటే దేశప్రజల మైండ్ సెట్ అయినా మారాలి లేదా చైనా ఉత్పత్తులకు ధీటుగా దేశీయ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి రావాలి. అంతవరకూ చైనా ఉత్పత్తులను ఆపడం ఎవరి తరం కాదనే భావించవచ్చు. 


Related Post