దుబ్బాక ఉపఎన్నికలలో 46 మంది బరిలో…

October 17, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. గడువు ముగిసేసరికి టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులతో కలిపి మొత్తం 46 మంది బరిలో మిగిలారు. వారిలో 24 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు. వారిలో 8 మంది తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయనందుకు నిరసనగా నామినేషన్లు వేస్తున్నట్లు ప్రకటించారు. టీవీ యాంకర్ కత్తి కార్తీక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. దుబ్బాక ఉపఎన్నికలలో 46 మంది పోటీ చేస్తుండటం ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. 

అయితే పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్యనే ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. స్వతంత్ర ఆభ్యర్ధులు ఎక్కువైతే ఓట్లు చీలి మూడు ప్రధానపార్టీలు కొంతమేర నష్టపోవచ్చు. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో 245మంది పసుపు రైతులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన తెలియజేసేందుకు నామినేషన్లు వేశారు. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమికి అదీ ఒక కారణమని అందరికీ తెలుసు. కనుక దుబ్బాక ఉపఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్ధులు ఎక్కువమంది బరిలో ఉంటే అధికార టిఆర్ఎస్‌ పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉండవచ్చు. కనుక నామినేషన్ల ఉపసంహరణ (సోమవారం) తరువాత ఎంతమంది బరిలో మిగులుతారో చూడాలి. 

దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్ : 

నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 

నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 

ఉపసంహరణ చివరి తేదీ:  అక్టోబర్ 19 

పోలింగ్ తేదీ : నవంబర్ 3 

కౌంటింగ్, ఫలితాలు వెల్లడి:  నవంబర్ 10


Related Post