దుబ్బాక బరిలో ఆ ముగ్గురు... ఎవరి సత్తా ఎంత?

October 15, 2020


img

నవంబర్‌ 3న జరుగబోయే దుబ్బాక ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేసినప్పటికీ పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల మద్యే జరుగుతుందని అందరికీ తెలుసు. కనుక ఆ మూడు పార్టీల అభ్యర్ధుల బలాబలాలు ఓసారి చూడక తప్పదు. 

ఇటీవల మరణించిన దుబ్బాక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్యే సోలిపేట సుజాత. ఆమెకు భర్త ద్వారా రాజకీయాలు, స్థానికంగా తమబలాబలాల గురించి మంచి అవగాహన ఉంది. అలాగే పార్టీలోని తన భర్త అనుచరుల అందండలు పుష్కలంగా ఉన్నాయి. భర్త చనిపోవడంతో ప్రజలలో ఆమె పట్ల సానుభూతి ఉంది. అదికూడా ఆమెకు సానుకూలాంశమే అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఆమె వెనుక కొండంత అండగా మంత్రి హరీష్‌రావు ఉన్నారు. ఆయన ఒక్కరే ఆమెను ఒంటి చేత్తో గెలిపించగలరు. 

అయితే కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులతో పోలిస్తే ఆమెకు రాజకీయానుభవం, వాక్చాతుర్యం లేనట్లే చెప్పవచ్చు. అందుకే ‘నేనే దుబ్బాకలో పోటీ చేస్తున్నట్లు భావించి ఆమెకు ఓట్లు వేయాలని’ మంత్రి హరీష్‌రావు ప్రజలను కోరుతున్నారు. ఆయనపై ఎంతో గౌరవం, నమ్మకం కలిగి ఉన్న ప్రజలు ఆయన కోరినట్లే టిఆర్ఎస్‌కు ఓట్లు వేసే అవకాశం ఉంది. 

ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి అపారమైన రాజకీయానుభవం, దుబ్బాకలో సొంత బలగం ఉంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పార్టీ అగ్రనేతల అండదండాలున్నాయి. నియోజకవర్గంలో తండ్రి చెరుకు ముత్యంరెడ్డికున్న మంచిపేరు ఆయనకు వరంగా ఉంటుంది. టిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినందున టిఆర్ఎస్‌ లోటుపాట్లు, బలహీనతలు అన్ని తెలుసు. కానీ ప్రతిపక్షపార్టీ నుంచి పోటీ చేస్తుండటం వలన ప్రజలు అధికార పార్టీని కాదని ఆయనకు ఓట్లు వేస్తారో లేదో అనుమానమే. 

బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు వృత్తిరీత్యా న్యాయవాది. మంచి వక్త. అపారమైన రాజకీయానుభవం కలవారు. గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినందున ఈసారి ఆ లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగే అవకాశాలున్నాయి. అలాగే దుబ్బాక నియోజకవర్గం గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గుర్తించి పూర్తి అవగాహన ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తి మద్దతు ఉంది. 

కానీ గతంలో రాధారమణి అనే మహిళపై లైంగికదాడి చేయడం, ఆమె దుబ్బాకలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొంటూ ఆయనకు ఓట్లు వేయవద్దని చేస్తున్న ప్రచారం, బిజెపి టికెట్ ఆశించి భంగపడిన కమలాకర్ రెడ్డి వర్గీయులు వ్యతిరేకత వంటివి ప్రతికూలాంశాలుగా చెప్పవచ్చు. టిఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయమని బిజెపి  నేతలు చెప్పుకొంటున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని ప్రతీ ఎన్నికలలోనూ రుజువు అవుతోంది. కనుక ప్రజలు ఆ రెండు పార్టీలను కాదని రఘునందన్ రావుకు ఓట్లు వేయాలంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి. అదేదో బిజెపికే తెలియాలి. 

రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమ పధకాలను, సిఎం కేసీఆర్‌ను, మంత్రి హరీష్‌రావులను చూసి ఓట్లు వేయాలని టిఆర్ఎస్‌ కోరుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలు, నిరంకుశ, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా తమకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నాయి. అయితే దుబ్బాక ప్రజలు దేనిని పరిగణనలోకి తీసుకొని ఏ పార్టీకి ఓట్లు వేస్తారో తెలియాలంటే నవంబర్‌ 10న ఫలితాలు వెలువడే వరకు ఎదురుచూడక తప్పదు. 


Related Post