నేడే చూడండి... మీ అభిమాన థియేటర్లలో...

October 15, 2020


img

అన్‌లాక్‌-5లో భాగంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. ఏపీ ప్రభుత్వం అనుమతించినప్పటికీ థియేటర్ల యజమానులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు తెరుచుకొనేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. 

ఐనాక్స్, కార్నీవాల్, సినీపోలీస్ సంస్థల అధ్వర్యంలో నడుస్తున్న మొత్తం 350  స్క్రీన్స్‌లో 225 స్క్రీన్స్‌లో నేటి నుంచి సినీ ప్రదర్శనలను ప్రారంభించబోతున్నాయి. పీవీఆర్‌ సంస్థ అధ్వర్యంలో 15 రాష్ట్రాలలో 500 థియేటర్లలో నేటి నుంచి సినీమాలను ప్రదర్శించబోతోంది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లను ప్రారంభించబోతున్నట్లు వాటి యజమానులు చెప్పారు. 

అయితే కరోనా నిబందనలతో సినిమా థియేటర్లు నడిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. థియేటర్లలో భౌతికదూరం పాటించేందుకు సగం సీట్లను ఖాళీగా విడిచిపెడితే గిట్టుబాటు కాదని, అలాగని టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు రారని థియేటర్ల యజమానులు వాదిస్తున్నారు. గత ఏడునెలలుగా సినిమా థియేటర్లు మూతపడటంతో చాలా నష్టపోయామని కనుక ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లులు, జీఎస్టీలో రాయితీలు ఇవ్వాలని థియేటర్ల యజమానులు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. వారి విజ్ఞప్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా స్పందించవలసి ఉంది. 

గత ఏడునెలలుగా సినిమా థియేటర్లు మూతపడటంతో చాలా నష్టపోయినందున తక్షణం థియేటర్లు తెరిచి సినీ ప్రదర్శనలు ప్రారంభించడమే మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తక్షణమే థియేటర్లు తెరుచుకొంటే ఈ దసరా దీపావళి పండుగ సీజన్‌లో వచ్చే రాబడితో కొంతవరకు కోలుకోగలుగుతామని, అదీగాక ఇప్పుడే థియేటర్లు తెరిచి సినీప్రదర్శనలు మొదలుపెడితేనే ప్రజలు థియేటర్లకు రావడానికి అలవాటుపడతారని, అలాగైతేనే వచ్చే సంక్రాంతి సీజన్‌లో రిలీజయ్యే సినిమాలు ఆడుతాయని లేకుంటే ప్రజలు పూర్తిగా ఓటిటీ ప్లాట్‌ఫారంలవైపు వెళ్లిపోయే ప్రమాదం ఉందని, కనుక కష్టమైనా నష్టమైనా థియేటర్లు తెరిచి సినీప్రదర్శనలు మొదలుపెట్టడమే మంచిదని మరికొందరు వాదిస్తున్నారు.    

థియేటర్లు తెరుచుకొంటేనే పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, దర్శకుల సినిమాలు విడుదల చేయగలుగుతారని అందరికీ తెలుసు. వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసేందుకు సిద్దపడే నిర్మాతలు, అలాగే ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు పారితోషికాలు తీసుకొనే హీరో, హీరోయిన్, దర్శకులు, సంగీత దర్శకులు తమ ఖర్చులు, పారితోషికాలు తగ్గించుకొని సినిమా థియేటర్ యజమానులకు తమవంతు ఆర్ధిక సహాయసహకారాలు అందిస్తే బాగుంటుంది కదా? 


Related Post