అవును తప్పే... వారికి మా క్షమాపణలు: తలసాని

September 23, 2020


img

ఇటీవల హైదరాబాద్‌ నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో నల్లాలు అన్నీ పొంగిపొర్లడంతో సుమేధా కపూరియా అనే 12 ఏళ్ళ బాలిక, నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆ నీళ్ళలో పడికొట్టుకుపోయి చనిపోయారు. ఆ ఘటనలపై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఇంతవరకు ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు కానీ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కానీ స్పందించలేదు. ఎట్టకేలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ రెండు ఘటనలపై మంగళవారం స్పందించారు. 

శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఓపెన్ నాలాలపై మూతలు బిగించకపోవడం తప్పే. ఆ కారణంగా సుమేధా కపూరియా, నవీన్ కుమార్ నాలాలలో పడి ప్రాణాలు కోల్పోవడం మాకు చాలా బాధ కలిగించింది. అందుకు వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున క్షమాపణలు, సానుభూతి తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

బోరుబావులలో చిన్నారులు పడి చనిపోతున్నారని, ఏటా వర్షాకాలంలో పొంగి ప్రవహించే నాలాలలో ప్రజలు పడి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారని మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రజలు పిర్యాదులు చేస్తున్నా...సమస్యలున్నాయని అధికారులకు తెలిసున్నా...ఏటా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు?

ఒక వ్యక్తిని హత్య చేస్తే పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేస్తారు. కోర్టులు చట్టప్రకారం శిక్ష విధిస్తాయి. ప్రజల ప్రాణాలు కోల్పోతే క్షమాపణలు, నష్టపరిహారాలతో సరిపెట్టేయడమేనా?వీటికి ప్రభుత్వంలో ఎవరూ బాధ్యత వహించరా?ఎవరిపై ఎటువంటి చర్యలు ఉండవా? అధికారుల బాధ్యతారాహిత్యానికి లేదా అఅలసత్వానికి ప్రజలు ప్రాణాలు కోల్పోవలసిందేనా?హైదరాబాద్‌లో నాలాలపై కాంక్రీట్ మూతలు వేసేందుకు మంత్రి కేటీఆర్‌ 300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో ఉన్న నాలాల సంగతో?వాటికి ఎప్పుడు మూతలు వేస్తారు?


Related Post