రాజ్యసభలో కొనసాగుతున్న ప్రతిష్టంభన

September 22, 2020


img

రాజ్యసభలో మొన్న ఆదివారంనాడు వ్యవసాయ బిల్లులను ఆమోదిస్తున్న సందర్భంగా కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, ఆమాద్మీ, సీపీఎం పార్టీలకు చెందిన 8మంది ఎంపీలు అనుచితంగా ప్రవర్తిస్తూ, సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ పదేపదే సభ వాయిదాపడేలా చేసినందుకు, రాజ్యసభ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ పట్ల అగౌరవంగా వ్యవహరించినందుకు వారం రోజులు పాటు సస్పెండ్ చేయబడ్డారు. 

సస్పెండ్ చేయబడిన 8 మంది సభ్యులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, ఆమాద్మీ, శివసేన పార్టీలు రాజ్యసభ సమావేశాలను బహిష్కరించాయి. టిఆర్ఎస్‌ కూడా వారికి మద్దతుగా సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు సభలో ప్రకటించి బయటకువచ్చేశారు. ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సమావేశాలకు హాజరుకాబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయి.    

కానీ 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గట్టిగా సమర్ధించుకొన్నారు. సమావేశాల సందర్భంగా ఎంపీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటుంటే, వారు ఏమాత్రం పట్టించుకోకుండా మూకుమ్మడిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వద్దకు దూసుకువచ్చి చాలా అనుచితంగా వ్యవహరించారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. సభా గౌరవానికి భంగం కలిగించేవిధంగా వ్యవహరించిన 8 మందిపై సస్పెన్షన్ వేటు వేయడమే సరైనదని కానీ వారు తమ తప్పును అంగీకరించి రాజ్యసభ ఛైర్మన్‌కు క్షమాపణలు చెప్పేందుకు అంగీకరిస్తే వారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పారు. 

ప్రతిపక్ష సభ్యులు తనపట్ల సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఆవేదన చెందిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ అందుకు నిరసనగా మంగళవారం ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.  

అధికార, ప్రతిపక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో రాజ్యసభ సమావేశాలలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ప్రతిపక్షాలు హాజరుకానప్పటికీ బిజెపి దాని మిత్రపక్షాలతో సమావేశాలు సజావుగా కొనసాగుతున్నాయి. కరోనా నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలను ఈ నెల 24తో ముగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కనుక ప్రతిపక్షాలు తిరిగివచ్చేలోగానే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోవచ్చు.


Related Post