ఆ బిల్లు అంత గొప్పదైతే రాజీనామాలెందుకు?

September 21, 2020


img

కేంద్రం తెచ్చిన రెండు వ్యవసాయబిల్లులపై మంత్రి కేటీఆర్‌ చాలా నిశితంగా విమర్శించారు. “ఇటీవల తెలంగాణ శాసనసభ రెవెన్యూ బిల్లును ఆమోదిస్తే రైతులు సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటూ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకొన్నారు. కేంద్రం చెప్పుకొంటున్నట్లు అది తెచ్చిన వ్యవసాయబిల్లులు నిజంగా అంత గొప్పవైతే మరి దేశంలో రైతులెవరూ సంబురాలు చేసుకోవడం లేదెందుకు? పైగా ఆ బిల్లును వ్యతిరేకిస్తూ అకాలీదళ్ పార్టీ ఎన్డీయే నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయింది?” అని ట్వీట్ చేశారు. 


శాసనసభ కొత్త రెవెన్యూ చట్టం ఆమోదించగానే రాష్ట్రవ్యాప్తంగా సిఎం కేసీఆర్‌ చిత్రపఠాలకు పాలాభిషేకాలు జరిగిన మాట వాస్తవం. కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వస్తే భూముల క్రయవిక్రయాలు త్వరితంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా జరుగుతాయని, దాంతో రైతుల కష్టాలన్నీ తీరిపోతాయని రైతులు సంబురాలు చేసుకొన్నారని టిఆర్ఎస్‌ చెపుతోంది. అయితే అవి టిఆర్ఎస్‌ ప్రాయోజిత సంబురాలని ప్రతిపక్షాల వాదన! 

కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో ప్రజలకు చాలా మేలు కలుగుతుందని సిఎం కేసీఆర్‌ ఏవిధంగా గట్టిగా, నమ్మకంగా చెపుతున్నారో, వ్యవసాయ బిల్లుల గురించి కూడా ప్రధాని నరేంద్రమోడీ అంతే గట్టిగా, నమ్మకంగా చెపుతున్నారు. 

ఇక రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది దానికి భాగస్వాములు ఎవరూ లేరు. కనుక శాసనసభలో రెవెన్యూ చట్టాన్ని ప్రతిపక్షాలు తప్ప వేరెవరూ వ్యతిరేకించే అవకాశం లేదు. కానీ కేంద్రంలో ఎన్డీయే కూటమిలో వివిద రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అవన్నీ తమ తమ రాష్ట్రాలలో రాజకీయ ప్రయోజనాలను, అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకొని వ్యవహరిస్తుంటాయనే సంగతి అందరికీ తెలుసు. 

వ్యవసాయ బిల్లుల వలన రైతులు నష్టపోతారని టిఆర్ఎస్‌ భావిస్తే, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ ఆ బిల్లుకు మద్దతు పలికింది. అంటే ఆ బిల్లుల వలన తెలంగాణలో రైతులు నష్టపోతే, ఏపీలో రైతులు మాత్రం లాభపడతారనుకోవాలా?అంటే కాదనే అర్దమవుతుంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి కేంద్రంతో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ఆ బిల్లుకు మద్దతు పలికిందని అర్దమవుతోంది. టిఆర్ఎస్‌ కూడా దుబ్బాక ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఆ బిల్లును వ్యతిరేకించి ఉండవచ్చు. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్‌ ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతుండటమే అందుకు నిదర్శనం. అలాగే అకాలీదళ్ కూడా పంజాబ్‌లో తన రాజకీయ ప్రయోజనాలను, లాభనష్టాలను బేరీజు వేసుకొని ఆ బిల్లును వ్యతిరేకించిందని భావించవచ్చు.

అయితే తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో మంచి చెడులు, లాభనష్టాల గురించి ఇంకా తెలియనట్లే, కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులలో మంచి చెడులు, లాభనష్టాలు కూడా ఇంకా తెలియవు. కనుక అంతవరకు ఓపికపడితే మంచిది. కానీ రాజకీయపార్టీలకు దేని లెక్కలు దానికుంటాయి కనుక అవి మంచిచెడుల కంటే రాజకీయంగా లాభనష్టాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాయి. కనుక దేని వాదనలు దానివేనని సరిపెట్టుకోకతప్పదు.


Related Post