దుబ్బాక ఉపఎన్నికలలో నిజామాబాద్‌ ఫార్ములా?

September 21, 2020


img

త్వరలో జరుగబోయే దుబ్బాక ఉపఎన్నికలకు టిఆర్ఎస్‌ అప్పుడే బలమైన వ్యూహం సిద్దం చేసినట్లే కనిపిస్తోంది. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు అమలుచేసిన వ్యూహాన్నే దుబ్బాకలో టిఆర్ఎస్‌ అమలుచేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, బిజెపిలు పసుపు రైతులను టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించడం ద్వారా కవితను ఓడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దుబ్బాక ఉపఎన్నికలలో ఆ రెండు పార్టీలను ఓడించేందుకు టిఆర్ఎస్‌ కూడా అదే వ్యూహం సిద్దం చేస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులను ప్రతిపక్షాలపైకి అస్త్రంగా ప్రయోగించబోతోంది. 

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు... వాటిలో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆ బిల్లులను పార్లమెంటులో మూజువాణి ఓటుతో ఆమోదింపజేయడాన్ని టిఆర్ఎస్‌ ఎంపీలు, రాష్ట్రంలో మంత్రులు, నేతలు తప్పు పడుతున్నారు. ఆ బిల్లులతో రైతులకు చాలా నష్టం జరుగుతుందని సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. టిఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటులోపల, బయటా వాటిని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తుంటే, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడానికి వెనుకాడబోమని ఇక్కడ రాష్ట్రంలోని టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. 

ఆ బిల్లులకు, దుబ్బాక ఉపఎన్నికలకు ఎటువంటి సంబందమూ లేనప్పటికీ, దానిని దుబ్బాక ఉపఎన్నికలతో ముడిపెట్టి టిఆర్ఎస్‌ను గెలిపించడం ద్వారా కేంద్రానికి, బిజెపికి బుద్ది చెప్పాలనే సరికొత్త పాటను టిఆర్ఎస్‌ నేతలు కోరస్ పాడుతున్నారు. అంటే వ్యవసాయ బిల్లును గట్టిగా వ్యతిరేకించడం ద్వారా రైతులను ఆకట్టుకొని దుబ్బాక ఉపఎన్నికలలో విజయం సాధించాలని టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. ఎన్నికల సమయంలో అనుకోకుండా అందివచ్చే అవకాశాలను రాజకీయపార్టీలు సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని ప్రయత్నించడం మామూలే. టిఆర్ఎస్‌ కూడా అందుకు అతీతం కాదు కనుక ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తోందని అర్దమవుతోంది. జాతీయరాజకీయాలలో ప్రవేశించేందుకు తగిన సమయం, అవకాశం కోసం ఎదురుచూస్తున్న సిఎం కేసీఆర్‌, ఇదే అదునుగా దేశంలో ప్రతిపక్షాలను ఫెడరల్ ఫ్రంట్‌ లేదా తాను స్థాపించబోయే నయా భారత్‌ పార్టీ గొడుగు క్రిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.


Related Post