హైదరాబాద్‌ నుంచే దేశంలో తొలి వ్యాక్సిన్‌?

September 21, 2020


img

భారత్‌లో రోజుకు కొత్తగా 90,000కు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య అరకోటి దాటిపోయింది. కనుక ఇప్పుడు కరోనాను తప్పించుకొంటూ రోజువారీ పనులు చేసుకోవడం చాలా కష్టంగా మారింది. కనుక కరోనా సోకకుండా అడ్డుకొనే వ్యాక్సిన్‌ కోసం ప్రజలందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 145 కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్లు వివిద దశలలో పరీక్షలు జరుగుతుండగా భారత్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కొవాక్సిన్’ ఈ రేసులో ముందుందని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 30 సంస్థలు వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో ఉన్నాయని వాటిలో భారత్‌ బయోటెక్ కంపెనీ, పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన ‘కోవీషీల్డ్’ వాక్సిన్,  అహ్మదాబాద్‌(గుజరాత్‌)లోని జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన ‘ZyCoV-D’ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌ చురుకుగా సాగుతున్నాయని, అవి వరుసగా మొదటి మూడు స్థానాలలో  ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇవి కాక మరో నాలుగు కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్లకు త్వరలో క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. 

కేంద్రప్రభుత్వం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ తయారుచేస్తున్న 30 కంపెనీలకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది చివరిలోగా లేదా 2021 జనవరిలో తప్పకుండా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి మొదలుపెట్టక మునుపే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు దానిని పంపిణీ చేసి ప్రజలందరికీ వాక్సిన్ వేయించేందుకు కూడా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.


Related Post