త్వరలో రాష్ట్రంలో సిటీ బస్సులు షురూ?

September 21, 2020


img

ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ఇప్పటికే సిటీ బస్ సర్వీసులు మొదలయ్యాయి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ముందుగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో రద్దీ ఎక్కువగా ఉండే ఏడు మార్గాలలో ప్రయోగాత్మకంగా 50 శాతం బస్సులు నడిపించి అవి విజయవంతమైతే మిగిలిన అన్ని నగరాలు, పట్టణాలలో సిటీ బస్సులు నడిపించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. 

నగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ సిటీ బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో సిటీ బస్సులు నడిపినేదుకు అనుమతి కోరుతూ టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఓ లేఖ వ్రాసినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలాఖరు నుంచే సిటీ బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్దంగా ఉంది. 

లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల నుంచి సిటీ బస్ సర్వీసులను నిలిపివేయడంతో వాటిపై ఎక్కువగా ఆధారపడే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు,మూడు నెలలుగా దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఒకటొకటిగా మళ్ళీ తెరుచుకొని అన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తుండటంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు సిటీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ సిటీ బస్సులలో కరోనా జాగ్రత్తలు పాటించడం దాదాపు అసంభవం కనుక వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు ఇష్టపడతారా లేదో చూడాలి. 

సిటీ బస్సులు తిరుగకపోవడంతో వాటిలో పనిచేసే డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది కూడా తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కానీ సిటీ బస్సులు నడిపించవలసివస్తే కరోనా బారిన పడతామేమోననే ఆందోళన కూడా వారిలో నెలకొంది. 

టీఎస్‌ఆర్టీసీది వేరే సమస్య. కరోనా వ్యాపించకుండా సిటీ బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం అదనపు భారం కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిటీ బస్సులలో భౌతికదూరం పాటించేందుకు సగం సీట్లు ఖాళీగా విడిచిపెట్టి నడిపిస్తే వచ్చే ఆదాయం కనీసం నిర్వహణ ఛార్జీలకైనా సరిపోదు. అదీగాక సిటీ బస్సులలో పనిచేసే తమ సిబ్బందికి కరోనా సోకితే వారికి పరీక్షలు, చికిత్స చేయించడం అదనపు భారంగా మారనుంది. కనుక సిటీ బస్సులు నడిపిస్తే ఓ సమస్య నడిపించకపోతే మరో సమస్య అన్నట్లుంది. కనుక సిటీ బస్సులు నడిపించడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం  తీసుకొంటుందో చూడాలి. 


Related Post