ప్రధానికి సిఎం కేసీఆర్‌ అమూల్యమైన సలహాలు

August 12, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాలలో కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీకి చాలా అమూల్యమైన సలహాలు, సూచనలు చేశారు. 

“అనూహ్యంగా మీదపడిన కరోనా మహమ్మారి మనకు అనేక విలువైన పాఠాలు నేర్పింది. ఇటువంటి సమస్యలు తలెత్తితే మనం వాటిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని నేర్పించింది. మన వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని గుర్తు చేసింది. హెల్త్ సైన్సస్, ఫార్మా రంగాలలో మరింత స్వయంసంవృద్ధి సాధించాలని కరోనాతో తెలిసివచ్చింది. ముఖ్యంగా దేశ జనాభాకు తగినంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను కూడా మనం తయారుచేసుకోవాలని అర్ధమైంది. అలాగే వైద్య పరికరాలు, మందులు తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించడం చాలా అవసరం. కనుక కరోనా నేర్పిన ఈ పాఠాల నుంచి మనం నేర్చుకొన్న విషయాలను ఆచరణలో పెట్టడం చాలా అవసరం. భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి సమస్యలు పునరావృతం కావచ్చు కనుక ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు, ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేవిధంగా సిద్దంగా ఉండాలి. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఈ అంశాలపై శ్రద్ద పెట్టి తక్షణమే కార్యాచరణకు ప్రణాళికలు సిద్దం చేయాలి. ఈ దిశలో కేంద్రం చొరవ తీసుకొని రాష్ట్రాలను కూడా కలుపుకుపోవాలి. ఈ విషయంలో కేంద్రానికి సంపూర్ణంగా సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లపుడూ సిద్దంగా ఉంటుంది,” అని కేసీఆర్‌ అన్నారు. 


Related Post