నాలుగు నెలలుగా జీతాలు లేవు...ఇలా ఎందుకు జరుగుతోంది?

August 12, 2020


img

ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇవాళ్ళ మధ్యాహ్నం ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. జీతాలు పెంచాలనో సదుపాయాలు కల్పించాలనో కాదు... నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని! తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలందిస్తుంటే కనీసం నెలనెలా జీతాలు ఇవ్వరా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు నెలలుగా తమకు జీతాలు ఇవ్వకపోయినా ఈ ఆపత్కాలంలో తమ వలన రోగులు ఇబ్బంది పడకూడదని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఎన్ని సమస్యలున్నప్పటికీ వాటన్నిటినీ పంటిబిగువున భరిస్తూ నిరంతరంగా కరోనా రోగులకు సేవలు అందిస్తున్నామని వారు చెప్పారు. కానీ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ జీతాల బకాయిలు చెల్లించి ఆదుకోవాలని వారు మీడియా ద్వారా సిఎం కేసీఆర్‌కు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. తమకు కూడా గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ సిబ్బందిలాగే జీతాలు పెంచాలని వారు కోరారు.      

ఆసుపత్రులకు నిధుల కొరత లేదని, సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటుంది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. ఇదివరకు గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇలాగే విధులు బహిష్కరించి మూడునలుగు రోజులు ధర్నాలు చేసిన తరువాత ప్రభుత్వం దిగివచ్చి వారి డిమాండ్లను తీర్చింది. ఇప్పుడు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది బయటకు వచ్చి ధర్నా చేయడంతో వారికి జీతాలు చెల్లించడం లేదనే విషయం బయటపడింది. కనుక ఇప్పుడు వారికి జీతాలు చెల్లించి ఎంతో కొంత పెంచవచ్చు కూడా. 

కరోనాపై ప్రత్యక్షపోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి జీతలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, అవే ఆసుపత్రులలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఎందుకు చెల్లించడం లేదు?వారి చేత పనిచేయించుకొంటున్నప్పుడు వారికి నెలనెలా జీతాలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కదా?తరచూ ఏదో ఒక శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈవిధంగా రోడ్డుపైకి వచ్చి జీతాల కోసం ఆందోళనలు చేస్తుండటం ధనికరాష్ట్రమైన తెలంగాణకు గౌరవప్రదంగా ఉంటుందా? ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి.


Related Post