కేసీఆర్‌కు జగన్ సమాధానం ఇవ్వలేదు కానీ...

August 12, 2020


img

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పదకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సిఎం కేసీఆర్‌ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశ్యించి ‘పిలిచి పీట వేసి అన్నం పెట్టి స్నేహ హస్తం అందిస్తే కయ్యానికి వస్తున్నారంటూ’ తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై వైసీపీ మంత్రులు, నేతలు ఎవరూ స్పందించలేదు కానీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి తెలంగాణ అభ్యంతరాలపై ఘాటుగా ఓ లేఖ వ్రాశారు. 

“తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 2016 నుంచి వరుసగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అపెక్స్ కౌన్సిల్ ఏనాడూ అడ్డుకోలేదు. కనీసం అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పధకాలు చేపట్టినప్పుడు మేము అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే శ్రీశైలం జలాశయంలో నీళ్ళు 800 అడుగుల ఎత్తు నుంచి తెలంగాణ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు నీటిని తోడుకొని ప్రాజెక్టులకు మళ్లిస్తున్నా కేంద్రం అడ్డుకోలేదు. శ్రీశైలం జలాశయంలో 796 అడుగుల ఎత్తు నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకొంటున్నా అభ్యంతరం చెప్పలేదు. కానీ మేము కరువుపీడిత రాయలసీమ జిల్లాలకు శ్రీశైలం జలాశయం నుంచి 800 అడుగుల ఎత్తున ఉన్న నీటిని వాడుకొంటే అభ్యంతరం చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల ఎత్తున నీటిని వాడుకొంటుంటే ఏపీని 854 అడుగుల ఎత్తున ఉండే నీటిని మాత్రమే వాడుకోవాలని చెప్పడం ఏమి న్యాయం? 

రాయలసీమ ఎత్తిపోతల పధకం కొత్తగా చేపట్టినది కాదు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ట్రిబ్యూనల్ ఉత్తర్వులకు భంగం కలుగకుండా నీటిని వాడుకొనేందుకు అప్పటికే మొదలుపెట్టిన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చునని స్పష్టంగా చెప్పింది. ఆ ప్రకారమే మేము రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని చేపట్టాము తప్ప కొత్తగా నిర్మించడం లేదు. అయినా మేము చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదిలో కేవలం 10-15 రోజులు మాత్రమే నీటిని ఎత్తిపోసుకోగలుగుతాము తప్ప ఏడాది పొడవునా కాదు. కనుక దీనిపై అభ్యంతరాలను పక్కనపెట్టి పనులు కొనసాగించేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాము,” అని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి లేఖలో వ్రాశారు.


Related Post