కోజీకోడ్ విమానాశ్రయంపై కేంద్రం ఆంక్షలు

August 12, 2020


img

కేరళలోని కోజీకోడ్ (కాలికట్) విమానాశ్రయంలో ఇటీవల ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ప్రమాదానికి గురయిన నేపద్యంలో ఇకపై వర్షాకాలం ముగిసేవరకు ఆ విమానాశ్రయానికి భారీ విమానాల రాకపోకలను నిషేదిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదాలకు ఆస్కారం లేని చిన్న విమానాలు మాత్రమే కోజీకోడ్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. 

ఈనెల 7వ తేదీ రాత్రి 7.40 గంటలకు దుబాయి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఎక్స్‌ప్రెస్‌ విమానం భారీ వర్షం పడుతుండగా కోజీకోడ్ విమానాశ్రయంలో దిగినప్పుడు రన్‌వేపై జారి వేగంగా దూసుకుపోయి రన్‌వే చివర సుమారు 50 అడుగుల దిగువన ఉన్న రోడ్డుపై పడి రెండు ముక్కలైంది. ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన పైలట్లు సమయస్పూర్తితో వ్యవహరించి విమానం గాలిలో ఎగురుతున్నప్పుడే మొత్తం ఇందనాన్ని ఖాళీ చేసేశారు. దాంతో విమానం రన్‌వేపై జారి కిందపడి రెండు ముక్కలైనప్పటికీ మంటలు అంటుకోలేదు. అందువలన ప్రాణనష్టం చాలా వరకు తగ్గింది. కానీ ఆరోజు జరిగిన ఆ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా 20 మంది చనిపోయారు. 

దేశంలో ‘టేబిల్ టాప్’ విమానాశ్రయాలలో ఒకటైన మంగళూరులో కూడా ఇదివరకు ఇటువంటి ప్రమాదమే జరిగింది. అప్పుడే ఈ విమానాశ్రయాలు అత్యంత ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరించారు. కనుక అప్పుడే పౌరవిమానయాన శాఖ మేలుకొని ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండి ఉంటే ఆగస్ట్ 7న ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు అంతమంది ప్రాణాలు కోల్పోయేవారే కాదు. కానీ మన దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదం జరిగిన తరువాతే మేల్కొని నిర్ణయాలు తీసుకోవడం అలవాటు కనుక ఇప్పుడూ ఘోర ప్రమాదం జరిగిన తరువాతే మేల్కొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రమాదం జరిగితే తప్ప ఆ అవకాశం ఉంటుందని ముందే గుర్తించలేనప్పుడు ఇంతమంది ఉన్నతాధికారులు, భద్రతా నిపుణులు ఉండి ఏం ప్రయోజనం?


Related Post