ప్రపంచంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ రష్యాలో విడుదల

August 11, 2020


img

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలన్నీ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అమెరికా, రష్యా, భారత్‌, చైనా, ఫ్రాన్స్, జర్మనీలతో సహా పలుదేశాలు వ్యాక్సిన్‌ తయారీలో పోటీ పడుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ముందుగా రష్యా ‘స్పుట్‌నిక్‌-వి’ పేరుతో కరోనాకు వ్యాక్సిన్‌ను ఇవాళ్ళ విడుదల చేసింది. ఈ విషయం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. మొట్టమొదటి వ్యాక్సిన్‌ను తన కుమార్తెకే ఇప్పించానని పుతిన్ ప్రకటించారు. ఈనెలలోనే లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని పుతిన్ చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ పనితీరు చాలా బాగుందని కనుక దీంతో దేశ ప్రజలు కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందుతారని ఆశిస్తున్నానని పుతిన్ అన్నారు. దీనిని యుద్ధప్రాతిపాదికన అతి తక్కువ సమయంలో తయారుచేసినందున దీని పనితీరును నిశితంగా గమనిస్తూ తనకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని పుతిన్ రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మైఖేల్  మురష్కోను పుతిన్ కోరారు. 

భారత్‌లో కూడా కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ చాలా జోరుగా సాగుతున్నాయి. భారత్‌లో ఒకేసారి రెండు వేర్వేరు సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్’ కాగా, మరొకటి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కంపెనీలు కలిసి తయారుచేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయబోతోంది. మరో రెండు మూడు నెలల్లో ఈ రెండూ ఒకేసారి లేదా ఏదో ఒకటి విడుదలయ్యే అవకాశం ఉంది. 


Related Post