కేసులు...రికవరీ రెండూ పెరుగుతున్నాయి

August 11, 2020


img

భారత్‌లో కరోనా ప్రవేశించి అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. ఈ ఆరునెలల్లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అందరూ కూడా కరోనా విషయంలో చాలా పాఠాలు నేర్చుకొన్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మొదట్లో చాలా ఉత్సాహంగా పనిచేసి కరోనాను కట్టడి చేసినప్పటికీ ఆ చర్యలతో కరోనా మహమ్మారిని పూర్తిగా నిలువరించలేమని గ్రహించిన తరువాత దానిని ఎదుర్కోవడానికి అనేకమార్గాలలో గట్టి ప్రయత్నాలు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. 

ఒకప్పుడు మాస్కులు, పీపీఈ కిట్లకే తడుముకొనే పరిస్థితిలో భారత్‌ ఉండేది. కానీ ఈ ఆరు నెలల్లో అవేకాదు...కరోనా కట్టడికి అవసరమైన టెస్టింగ్ కిట్స్, మందులు, కరోనా కేర్ సెంటర్లు, పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులు, బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ఒకటేమిటి ప్రతీది భారీగానే ఏర్పాటు చేసుకోగలిగాము. మొదట్లో కరోనా అంటే ఉండే భయం కూడా చాలా తగ్గింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా చేస్తున్న ప్రచారం వలన కరోనా సోకకుండా ఏవిధంగా కాపాడుకోవాలో, వస్తే ఏవిధంగా ఎదుర్కోవాలో అందరికీ తెలిసింది. దాంతో ఇప్పుడు దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొలుకొంటున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు 40-45 శాతం ఉండే రికవరీ రేటు ఇప్పుడు 68.78 శాతానికి చేరింది. అలాగే మరణాల రేటు కూడా 2.01కి తగ్గింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అనేక చర్యలు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ కార్యకర్తల సమిష్టి కృషి, కరోనా గురించి ప్రజలలో అవగాహన పెరిగి జాగ్రత్తలు పాటిస్తుండటం, ప్రజలలో రోగనిరోధక శక్తి పెరగడం వంటి అనేక కారణాల చేత దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకి వచ్చేస్తే, దేశం కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందగలదు. బహుశః ఈ ఏడాది డిసెంబర్‌లోగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక 2020 లోనే కరోనా మహమ్మారిని వదిలించుకోగలిగితే కొత్త ఆశలతో 2021లోకి అడుగుపెట్టవచ్చు. కరోనా నేర్పిన ఈ పాఠాలతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య, ఫార్మా రంగాలను మరింత బలోపేతం చేసుకొంటాయని ఆశిద్దాం.


Related Post