జగన్‌పై కేసీఆర్‌ ఆగ్రహం అందుకేనా?

August 11, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశ్యించి, “నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. వృధాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం” అని హెచ్చరించడంపై ఏపీ ప్రభుత్వం ఘాటుగానే స్పందించవచ్చు. కానీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ ఇంత తీవ్రంగా ఎందుకు మాట్లాడారు? అని ఆలోచిస్తే మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది.  

తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సిఎం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగించడం సహజమే. అయితే అదొకటే కారణం కాదు. జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రి నేతృత్వంలో ఇరువురు ముఖ్యమంత్రులతో ఆగస్ట్ 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనుకొంటే, దానిని ఆగస్ట్ 20 తరువాత నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులకు ఆగస్ట్ 17న టెండర్లు ఖరారు చేయనుంది కనుక దానికి వెసులుబాటు కల్పించేందుకే సిఎం కేసీఆర్‌ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయించారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడవలసిన సిఎం కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌, బిజెపి నేతలు రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. వారికి కూడా జవాబు చెప్పేందుకే సిఎం కేసీఆర్‌ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడి ఉండవచ్చు. తద్వారా వారి కంటే తానే తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని అందుకోసం ఏపీ ప్రభుత్వంతో యుద్ధానికి కూడా వెనుకాడబోనని ప్రతిపక్షాలకు, ప్రజలకు నొక్కి చెప్పడమే సిఎం కేసీఆర్‌ ఉద్దేశ్యం కావచ్చు. 


Related Post