పిలిచి పీటేసి అన్నం పెట్టి మర్యాదలు చేస్తే...

August 11, 2020


img

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య మళ్ళీ యుద్ధం మొదలైంది. ఏపీలో నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కృష్ణా ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దాని వలన దిగువన ఉన్న ఏపీకి తీరని నష్టం కలుగుతోందని ఆరోపణలు చేసింది. దీంతో రెండు రాష్ట్రాల మద్య మళ్ళీ జలజగడాలు మొదలయ్యాయి. తెలంగాణ సిఎం కేసీఆర్‌ నిన్న ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశ్యించి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేయడంతో యుద్ధం పతాకస్థాయికి చేరినట్లయింది.

ప్రగతి భవన్‌లో సోమవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సిఎం కేసీఆర్‌ సమావేశమైనప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. బేసిన్లు లేవు...భేషజాలు లేవు..అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాము. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాము. వృధాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా...వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం,” అని అన్నారు. 

ప్రాజెక్టుల నిర్మాణాలు, నదీజలాల పంపిణీ, వివాదాలు తదితర విషయాలలో కేంద్రప్రభుత్వం వైఖరిని కూడా సిఎం కేసీఆర్‌ తప్పుపట్టారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులను ఆనాటి పాలకులు సకాలంలో పూర్తిచేయకపోవడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత వాటినే రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా రీ-డిజైనింగ్ చేసుకొని నిర్మించుకొంటుంటే, ఏపీ ప్రభుత్వం పేచీలు పెడుతోందని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబందించి పూర్తి వివరాలతో ఏపీ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వాలకు గట్టిగా సమాధానాలు చెపుదామని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post