ఆ ఆసుపత్రులకు అనుమతులు రద్దు చేస్తాం: ఈటల హెచ్చరిక

August 05, 2020


img

కరోనా మహమ్మారి దేశాన్ని...ప్రజలను పట్టి పీడిస్తుంటే, ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్స పేరిట రోగులను కరోనా మహమ్మారి కంటే ఎక్కువగా పట్టిపీడిస్తున్నాయి. కరోనా చికిత్సకు ప్రభుత్వాలు ఛార్జీలను ప్రకటించినప్పటికీ... అంతకు మించి వసూలుచేయవద్దని మెత్తగా హెచ్చరించినప్పటికీ అవి ఏమాత్రం పట్టించుకోకుండా రోగులను  డబ్బు కోసం పీడిస్తున్నాయి. 

ఈ సమస్యపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈ కరోనా విపత్కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సామాజిక బాధ్యతగా ప్రభుత్వం ప్రకటించిన ఛార్జీలతో కరోనా రోగులకు చికిత్స చేస్తాయని ఆశించాము. కరోనాను వ్యాపారకోణంలో చూడరాదని ముందే చెప్పాము. కానీ మా సూచనలను, ఆదేశాలను ఖాతరు చేయకుండా కరోనా చికిత్స పేరుతో రోగుల దగ్గర లక్షల రూపాయాలు ఫీజువసూలు చేస్తున్నట్లు మాకు అనేక పిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు అనుమతులు రద్దు చేశాము. త్వరలోనే మరికొన్నిటిపై చర్యలు తీసుకోబోతున్నాము. డబ్బు సంపాదనకు రోగులను, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆసుపత్రులు బ్లాక్ మెయిల్ చేయడం చాలా దారుణం. దాన్ని మేము సహించం. ఇకనైనా ప్రైవేట్ ఆసుపత్రులు తమ వైఖరిని మార్చుకోకుంటే కరోనా చికిత్సకు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయడానికి వెనకాడబోము,” అని అన్నారు. 

ప్రైవేట్ ఆసుపత్రులు నిర్భయంగా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి రోగులను దోచుకొంటున్నాయని స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందరే చెపుతుండటం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా చికిత్స చేయడానికి వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరిస్తున్నారే తప్ప ఇంతవరకు రోగులను వారి కుటుంబ సభ్యులను దోచుకొని ఫీజుల పేరిట దోచుకొన్నందుకు వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని చెప్పలేకపోతున్నారు! 

అయినా కరోనా చికిత్స చేయడానికి అనుమతులు రద్దు చేస్తే వాటికేమైనా నష్టం వస్తుందా...అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే కరోనా అనేది వాటికి ఒక బోనస్ వంటిదే తప్ప అదే ప్రధాన ఆదాయం కాదు. కరోనా చికిత్స చేయడానికి వాటికి అనుమతి రద్దు చేస్తే అవి యధాప్రకారం ఇతర రోగులకు చికిత్సలు చేస్తూ తమ దోపిడీని కొనసాగిస్తాయి. అంతే!


Related Post