లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ విస్పోటనం

August 05, 2020


img

లెబనాన్ రాజధాని బీరుట్‌లో మంగళవారం భారీ విస్పోటనం జరిగింది. ఆ ప్రేలుడులో సుమారు 50 మంది వరకు అక్కడికక్కడే చనిపోగా సుమారు 4,000 మందికి పైగా గాయపడ్డారు. ప్రేలుడు ధాటికి బీరుట్ వాణిజ్య నౌకాశ్రయం మొత్తం నేలమట్టమైంది. దాని పరిసర ప్రాంతాలలో ఉన్న భారీ భవనాలన్నీ కూడా పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఆ శిధిలాల క్రింద అనేకమంది చిక్కుకొని ఉండే అవకాశం ఉంది. 

బీరుట్ నౌకాశ్రయంలో అమోనియం నైట్రేట్‌ నిలువ ఉంచిన ఓ గోదాములో మొదట ఈ ప్రేలుడు మొదలైంది. చూస్తుండగానే కొన్ని సెకన్లలో భారీ విస్పోటనం జరిగి పక్కనే భారీ భవనంతో సహా అనేక చిన్న పెద్దా భవనాలు నేలమట్టం అయ్యాయి. ప్రేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే దాని శబ్ధాలు 240 కిమీ దూరం వరకు వినిపించాయి. ప్రేలుడు ధాటికి బీరుట్ నగరంలో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఘటనా స్థలానికి చాలా దూరంలో రోడ్లపక్కన నిలిపి ఉంచిన కార్లు గాలిలోకి ఎగిరిపడి నూజ్జునుజ్జు అయ్యాయి. ఆ ప్రేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే భూకంప తీవ్రతను కొలిచే రిక్టర్ స్కేలుపై సుమారు 3.1 వరకు ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. చెవులు కన్నాలు పడిపోయేంత శబ్ధాలతో భారీ ప్రేలుళ్ళు జరుగుతుంటే  బీరుట్ ప్రజలు భయాందోళనలతో కంపించిపోయారు. శతృదేశాల విమానాలు నగరంపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయా లేక ఆత్మహుతిదళాలు నగరంలో వరుస దాడులు చేస్తున్నాయా? అని భయపడ్డారు. 

లెబనాన్‌లో దశాబ్ధాలుగా అశాంతి, అరాచకం నెలకొని ఉన్నాయి. నిత్యం ఆత్మహుతిదాడులు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో అక్కడ ప్రేలుళ్ళు జరుగుతూ వాటిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ ఈ స్థాయిలో విస్పోటనం జరుగడం ఇదే మొదటిసారి. కనుక ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా కావాలనే అమోనియం నైట్రేట్ గోదామును పేల్చివేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రేలుడు జరిగినప్పుడు గోదాములో సుమారు 2700 టన్నుల అమోనియం నైట్రేట్ నిలువ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రేలుడుతో గాయపడినవారిని, శిధిలాల క్రింద చిక్కుకొన్నవారిని కాపాడి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఒకేసారి వేల సంఖ్యలో క్షతగాత్రులు వస్తుండటంతో బీరుట్ నగరంలో ఆసుపత్రులన్నీ వారితో నిండిపోయాయి.

లెబనాన్‌లో కూడా చాలా మంది భారతీయులు పనిచేస్తున్నందున వారి యోగక్షేమల గురించి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. కనుక అక్కడి పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు లెబనాన్‌లో ఇండియన్ ఎంబసీ ఈ మూడు ఫోన్‌ నెంబర్లను విడుదల చేసింది.  

కార్యాలయం పని సమయంలో: 01741270, 01735922

కార్యాలయం మూసి వేసిన తరువాత: 01738418




Related Post