డెక్కన్ ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు

August 04, 2020


img

రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స చేయడానికి అనుమతించిన ఆసుపత్రులలో డెక్కన్ హాస్పిటల్ కూడా ఒకటి. అయితే కరోనా చికిత్స పేరుతో రోగుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తుండటంతో దానిపై పలువురు ప్రభుత్వానికి పిర్యాదులు చేశారు. ఒక వ్యక్తి తల్లితండ్రులు, అన్నయ్యకు కరోనా సోకడంతో డెక్కన్ హాస్పిటల్లో చేర్చగా వారు ముగ్గురి చికిత్స కోసం అతను సుమారు రూ.40 లక్షలు చెల్లించాడు. కానీ వారు ముగ్గురూ చనిపోయారు. అయినా మరో 3 లక్షలు చెల్లిస్తే కానీ వారి మృతదేహాలను ఇవ్వబోమని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో అతను ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఈవిషయం తెలియజేశారు. దాంతో డెక్కన్ హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందని తెలిసిన తరువాత కూడా డెక్కన్ హాస్పిటల్ యాజమాన్యం తీరులో ఏమాత్రం మార్పు రాకపోగా కరోనా నెగెటివ్ అని నిర్ధారణ అయిన ఒక న్యాయవాదికి కరోనా సోకిందని చికిత్స చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. ఆ విషయం పసిగట్టిన ఆయన పంజగుట్ట పోలీసులకు డెక్కన్ హాస్పిటల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. 

డెక్కన్ హాస్పిటల్ ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతుండటంతో, కరోనా చికిత్సలు చేయడానికి అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అక్కడ కరోనా చికిత్స పొందుతున్నవారికి మాత్రం చికిత్స అందించేందుకు అనుమతించింది. కానీ వారి వద్ద నుంచి ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయరాదని చేస్తే కటినచర్యలు తప్పవని హెచ్చరించింది. 

అయితే ప్రభుత్వం తీసుకొన్న చర్యలతో డెక్కన్ హాస్పిటల్‌ మరింత చిక్కుల్లో పడకుండా కాపాడినట్లున్నాయి తప్ప హాస్పిటల్ యాజమాన్యం చేసిన దోపిడీకి శిక్షించినట్లు లేవని అర్ధమవుతూనే ఉంది. ఒకవేళ సదరు హాస్పిటల్‌పై ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకోదలిస్తే, సిఎం కేసీఆర్‌ హెచ్చరించినట్లుగా ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరించి రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసినందుకు హాస్పిటల్ లైసెన్స్ ను పూర్తిగా రద్దు చేయాలి. ఇప్పటివరకు రోగుల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును హాస్పిటల్ యాజమాన్యం నుంచి ప్రభుత్వమే వసూలు చేసి రోగుల కుటుంబాలకు తిరిగి అప్పగించి ఉండాలి. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి, రోగులను పీడించినందుకు హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ అవేవీ చేయకుండా కేవలం కరోనా చికిత్సలు చేయడానికి అనుమతిని రద్దు చేయడం గమనిస్తే డెక్కన్ హాస్పిటల్‌ మరింత చిక్కుల్లో పడకుండా కాపాడినట్లుంది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే కటిన చర్యలు తప్పవని హూంకరించిన తెలంగాణ ప్రభుత్వం డెక్కన్ హాస్పిటల్ పట్ల మెతకవైఖరి ప్రదర్శించడానికి కారణం ఏమిటి? 


Related Post