సుశాంత్ సింగ్‌ ఆత్మహత్య కేసులో మరో మలుపు

August 03, 2020


img

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అతని స్నేతురాలైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన కుమారుడి బ్యాంక్ అకౌంట్‌లో నుంచి సుమారు 15 కోట్లు తీసుకొందని, ఆమె తన కొడుకును బ్లాక్ మెయిల్ చేసి చివరికి అతని మరణానికి కారణమయ్యుండవచ్చని సుశాంత్ తండ్రి బిహార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలో మలుపులు మొదలయ్యాయి. 

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌తో తాను ఏడాదిన్నరపాటు సహజీవనం సాగించానని రియా చక్రవర్తి స్వయంగా బయటపెట్టింది. అయితే తనపై మహారాష్ట్ర, బీహార్ పోలీసులు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించింది. 

సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు కేసు నమోదు చేయడంతో, ఈడీ అధికారులు కూడా రంగంలో దిగి సుశాంత్ అకౌంట్‌లో నుంచి 15 కోట్లు రియా చక్రవర్తి ఏవిధంగా వేరే అకౌంట్‌లలోకి మళ్ళించింది? అవి ఎవరెవరి పేరిట ఉన్నాయి? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 

సుశాంత కేసుపై దర్యాప్తు జరిపిన మహారాష్ట్ర పోలీసులు అది  ఆత్మహత్యేనని తేల్చి చెప్పారు. కానీ పాట్నాలో సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో బీహార్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు ముంబై చేరుకొన్నారు. కానీ వారిని ముంబై పోలీసులు బలవంతంగా వెనక్కు తిప్పి పంపారు. దాంతో బీహార్ బిజెపి సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

బాలీవుడ్ మాఫియా ఒత్తిళ్ళకు తలొగ్గి ఉద్దవ్ థాక్రే ఈ కేసులో నిజాలు బయటపడకుండా దాచిపెట్టి దోషులను కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే బిహార్ పోలీసులను దర్యాప్తుకు అనుమతించడం లేదని ఆరోపించారు. దాంతో బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మద్య మాటల యుద్ధం మొదలైంది. 

ఈకేసుపై విచారణ జరిపేందుకు మళ్ళీ బిహార్ సీనియర్ పోలీస్ అధికారి వినయ్ తివారీ సోమవారం ఉదయం ముంబై చేరుకోగా, ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆయన చేతిపై క్వారెంటైన్‌ ముద్ర వేసి బలవంతంగా క్వారెంటైన్‌ కేంద్రానికి తరలించారు. దీంతో బిహార్ డీజిపీ గుప్తేశ్వర్ పాండే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

ఇది ఇలా ఉండగా ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ మీనాక్షీ మిశ్రా మరో బాంబు పేల్చారు. పోస్టుమార్టం తరువాత ముంబై పోలీసులు విడుదల చేసిన సుశాంత్ ఫోటోను నిశితంగా పరిశీలించిన ఆమె, అతని నుదుటపై, కుడివైపు బుగ్గపై ఎవరో కొట్టినట్లు గాయాలను గుర్తించారు. సాధారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నవారి కళ్ళు, నాలుక బయటకు ఉబికి వస్తాయని కానీ సుశాంత్ సింగ్‌ కళ్ళు, నాలుక సాధారణంగానే ఉన్నాయని ఆమె అన్నారు. అంటే సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ను ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చని, పోస్టుమార్టంలో ఈవిషయాలన్నీ ఖచ్చితంగా బయటపడతాయని, కానీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే వాటిని దాచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు. హత్యకేసులో వాస్తవాలు దాచిపెట్టినందుకు ముంబై పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 


Related Post