వైద్యులే నియామకాలను అడ్డుకొంటున్నారు: రిమ్స్ డైరెక్టర్

August 03, 2020


img

ఆదిలాబాద్‌ జిల్లాలో రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సస్) ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బానోత్ బలరాం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆసుపత్రిలో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయనీయకుండా సీనియర్ వైద్యులే అడ్డుపడుతున్నారు. కొత్తవారిని నియమిస్తే తమకు నష్టం జరుగుతుందని వారు భయపడుతున్నారు. ‘నా కుర్చీ...నా పోస్ట్ నాకే ఉండాలి... ఎవరూ రాకూడదు,’ అన్నట్లు కొందరు సీనియర్ వైద్యులు మాట్లాడుతున్నారు. ఒక్కో విభాగంలో రెండు మూడు ఖాళీలున్నాయి. కనుక కనీసం ఒక్క పోస్ట్ భర్తీకి సహకరించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను కానీ వారు అంగీకరించడం లేదు. వారు అంగీకరించకపోయినా రిమ్స్ లో ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ మేము పై అధికారులకు లేఖలు కూడా వ్రాశాము. కానీ సీనియర్ వైద్యులకు మద్దతు పలుకుతున్న కొందరు స్థానిక రాజకీయనేతలు కూడా అడ్డుపడుతుండటంతో ఖాళీలను భర్తీ చేయలేకపోతున్నాము. నిజానికి కొత్త వైద్యులు వస్తే ప్రస్తుతం ఉన్న సీనియర్లకు ప్రమోషన్స్ వస్తాయి. వారిపై పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. పైగా మరింత ఎక్కువ మందికి వైద్యసేవలు అందించవచ్చునని మేము ఎంతగా నచ్చచెపుతున్నా వారు సహకరించడంలేదు. ఆసుపత్రిలో సిబ్బంది నియామకాలు చేయలేకపోవడంతో రోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటివరకు ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాల విషయంలో ప్రభుత్వం తరపున ఆలస్యం జరుగుతున్నట్లు వార్తలు వస్తుండేవి. కానీ వైద్యులే నియామకాలు జరుగకుండా అడ్డుపడుతున్నట్లు వార్త రావడం బహుశః ఇదే మొదటిసారేమో? ఈవిషయం బయట పెట్టినందుకు ప్రభుత్వం రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బానోత్ బలరాంపై చర్యలు తీసుకోకుండా ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ చేయకుండా అడ్డుపడుతున్న వైద్యులపై, వారికి సహకరిస్తున్న రాజకీయ నేతలపై చర్యలు తీసుకొని తక్షణం రిమ్స్ లో ఖాళీలు భర్తీ చేస్తే బాగుంటుంది.

సాక్షి న్యూస్ సౌజన్యంతో:  



Related Post