నోటిదురదతోనే ట్రంప్‌ ఓడిపోతారేమో?

August 01, 2020


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నోటిదురద గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌ 3న జరుగవలసిన అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు. కరోనా భయంతో ప్రజలు ధైర్యంగా బయటకువచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేకపోవచ్చు కనుక ఎన్నికలను కొన్ని రోజులు వాయిదావేస్తే బాగుంటుందన్నారు. ఈమెయిల్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తే దానిలో చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది కనుక 2020 అధ్యక్ష ఎన్నికలు లోపభూయిష్టంగా మారవచ్చని అన్నారు.  

 ఊహించినట్లే ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆయన ఓటమిని ముందే పసిగట్టినందునే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారని వాదిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష ఎన్నికలను ఎట్టి పరిస్థితులలో వాయిదావేయడానికి వీలులేదు. ఈ సంగతి ట్రంప్‌కు కూడా బాగా తెలుసు. అయినా ఇటువంటి ప్రతిపాదన చేయడంతో సొంత రిపబ్లికన్ పార్టీలో సభ్యులే ఆయనను సమర్ధించలేకపోతున్నారు. దాంతో ట్రంప్‌ మళ్ళీ మాట మార్చారు. 

“నేను అధ్యక్ష ఎన్నికలను వాయిదావేయాలని కోరడం లేదు. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించలేని ఈ పరిస్థితులలో ఈ మెయిల్ విధానంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి, ఎన్నికలు పూర్తయిన 3-4 నెలలకు దానిలో అవకతవకలు జరిగాయని గుర్తిస్తే అప్పుడు ఏమీ చేయలేము. కనుక 3-4 నెలల ముందుగానే దీనిపై చర్చ జరగాలనే ఉద్దేశ్యంతోనే ఆ విధంగా సూచించాను,” అని అన్నారు. 

కానీ అమెరికన్ల సెంటిమెంట్‌తో ముడిపడున్న అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలనే ట్రంప్‌ సూచనను ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని ట్రంప్‌పై పైచేయి సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ సూచనపై ప్రజలలో కూడా వ్యతిరేకత కనబడుతోంది. కనుక ఇప్పటికే ఏటికి ఎదురీదుతున్న ట్రంప్‌ నోటిదురదతో తన పరిస్థితిని మరింత దిగజార్చుకొన్నట్లయింది. కనుక ఈ నోటిదురద తగ్గించుకోకపోతే అది కూడా ఆయన ఓటమికి ఓ కారణం కావచ్చు. 


Related Post