రాజకీయ ప్రయోగశాలగా మారిన ఏపీ

August 01, 2020


img

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అభివృద్ధి పధంలో దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఓ రాజకీయ ప్రయోగశాలగా మారిపోయింది. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపారు కనుక ఆయనైతేనే ఏపీకి రాజధానిని నిర్మించి రాష్ట్రాన్ని గాడిన పెడతారనే గట్టి నమ్మకంతో ప్రజలు 2014లో ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. మొదట ఆయన చాలా చురుకుగానే చేశారు. కానీ రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టకుండా 3 ఏళ్ళు కాలక్షేపం చేసారు. ఆ తరువాత మిగిలిన రెండేళ్ళు కేంద్రంతో గొడవలతో పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది.

తరువాత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రయోగం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. విశాఖలో పరిపాలన రాజధానిగా చేయాలని పట్టుదలతో ఉన్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ చేత ఆమోదముద్ర వేయించుకోగలిగింది. కనుక త్వరలోనే రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలింపు ప్రక్రియ మొదలుకాబోతోంది.

దీనిని ప్రధాన ప్రతిపక్షం టిడిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో ఏపీలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే రాజధానిని విశాఖ నుంచి అమరావతికి తరలించవచ్చు. అదే కనుక జరిగితే అది మళ్ళీ మరో పెద్ద ప్రయోగం అవుతుంది. 

అమరావతి రాజధానిగా ఉంటుందనే భావనతో అక్కడ చాలామంది భారీ పెట్టుబడులు పెట్టారు. కానీ ఇప్పుడు రాజధాని విశాఖకు తరలిపోతోంది. కనుక అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంకోచించవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు అటు అమరావతిలోను, ఇటు విశాఖలోను పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగువేస్తే ఏపీ అభివృద్ధి కుంటుపడుతుందని వేరే చెప్పక్కరలేదు.  

ఈ ప్రయోగాలన్నీ ఇంకా ఎప్పటికీ ముగుస్తాయో... ఏపీకి శాశ్విత రాజధాని ఎక్కడ ఉంటుందో తెలిసేవరకు ఏపీలో పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాలలో అభివృద్ధిపనులు నత్తనడకన సాగవచ్చు. రాష్ట్రం విడిపోయి 6 ఏళ్ళు గడిచినా నేటికీ ఏపీలో ఇటువంటి అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నందుకు... రాష్ట్రం అభివృద్ధికి నోచుకోనందుకు ప్రజలు పాలకులను నిందించాలా? లేక తమను తామే నిందించుకోవాలా? 


Related Post