ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు నోటీస్

July 31, 2020


img

కృష్ణానది మిగులు జలాలను రాయలసీమ జిల్లాలకు వినియోగించుకొనేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్ధ్యం పెంచాలని నిర్ణయించింది. దాని కోసం ఓ జీవోను జారీ చేసీఎండీ. దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ జలవనరులశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. దానిపై స్పందించిన కృష్ణాబోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. బోర్డు అనుమతించేవరకు ఎటువంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది. ఆ ప్రాజెక్ట్ సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

కానీ ఏపీ ప్రభుత్వం బోర్డు ఆదేశాలు పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించడంతో ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణా బోర్డుకు మళ్ళీ ఫిర్యాదు చేశారు. దానిపై  బోర్డు సభ్యుడు హరికేశ్‌మీనా స్పందిస్తూ టెండర్ల ప్రక్రియని నిలిపివేయవలసిందిగా కోరుతూ ఏపీ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖ వ్రాశారు. ఆ ప్రాజెక్ట్ సమగ్ర నివేదికను సమర్పించి, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన తరువాతే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.

కానీ ఇంతకు ముందు బోర్డు ఆదేశాలనే పట్టించుకొని ఏపీ ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను పట్టించుకొంటుందా? ఒకవేళ పట్టించుకోకపోతే కృష్ణా బోర్డు ఆ ప్రాజెక్టును అడ్డుకోగలదా?లేక ప్రాజెక్ట్ పనులు జరుగుతుంటే ఇలాగే నోటీసులు పంపిస్తూ ప్రేక్షకపాత్రకు పరిమితమవుతుందా చూడాలి.


Related Post