ఇంతకీ అతనికి ఆక్సిజన్ పెట్టారా లేదా? హైకోర్టు ప్రశ్న

July 31, 2020


img

జూన్‌ 24న ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో వి.రవికుమార్ (34) అనే యువకుడికి వైద్య సిబ్బంది ఆక్సిజన్ పెట్టకపోవడంతో చాలా నరకయాతన అనుభవించి చనిపోయాడు. చనిపోయే ముందు తను పడుతున్న బాధను, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తాము రవికుమార్‌కు వెంటిలేటర్ పెట్టనేలేదని కనుక ఆక్సిజన్ తొలగించామనడం అబద్దమని ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ ఖాన్ ఆరోజు వాదించారు. కానీ రవికుమార్ చనిపోయేముందు తీసిన సెల్ఫీ వీడియోలో ముక్కుకు ఆక్సిజన్ గొట్టాలున్నాయి! 

ఆ ఘటనపై ఎవరూ మాట్లాడకపోవడంతో ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తరువాత ఎటువంటి సమస్యా ఎదురవలేదు. కానీ రాష్ట్ర బిజెపి యువమోర్చా అధ్యక్షుడు యశ్‌పాల్‌గౌడ్ ఆ ఘటనపై హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో మళ్ళీ చర్చ మొదలైంది. 

ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసుపై గురువారం విచారణ చేపట్టినప్పుడు, ఆసుపత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “రవికుమార్ చనిపోయేముందు తీసి పంపిన సెల్ఫీ వీడియోలో తాను వైద్యులను బ్రతిమాలినా ఆక్సిజన్ పెట్టలేదని చెప్పాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టామని, కానీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చెపుతున్నారు. దీనిలో ఏది నిజం? అసలు రవికుమార్‌కు సంబందించిన వైద్య నివేదికలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదు?రవికుమార్ మృతిపై పోలీసులను దర్యాప్తు చేయమని ఆదేశించమంటారా?అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం గట్టిగా నిలదీసింది. రవికుమార్ గుండె సంబందిత వ్యాధితో చనిపోయాడు తప్ప ఆక్సిజన్ లేక కాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కొంత గడువు ఇస్తే రవికుమార్‌కు సంబందించిన వైద్య నివేదికలను కోర్టుకు సమర్పిస్తానని చెప్పడంతో ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 18కు వాయిదా వేసి ఆలోగా రిపోర్టును సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ను ధర్మాసనం ఆదేశించింది.


Related Post