రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పైలట్ గండం

July 13, 2020


img

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభం కూడా ఎదురైంది. ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుకు సిద్దమయ్యారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరికొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని, సిఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని ప్రకటించడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. 

సచిన్ పైలట్ ఇటీవల బిజెపి సీనియర్ నేత జ్యోతిరాధిత్య సిండియాతో సమావేశం అయిన తరువాత ఈ ప్రకటన చేయడంతో ఆయన వెనక బిజెపి ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. నేడో రేపో ఆయన బిజెపిలో చేరుతారని అందరూ భావిస్తుంటే, తాను బిజెపిలో చేరబోవడంలేదని కానీ సోమవారం ఉదయం జైపూర్‌లో జరుగబోయే సీఎల్పీ సమావేశానికి తాను హాజరుకావడంలేదని సచిన్ పైలట్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడింది. 

జైపూర్‌లో సిఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో కొద్ది సేపటి క్రితం మొదలైన సీఎల్పీ సమావేశానికి మొత్తం 109 మంది ఎమ్మెల్యేలలో 97 మంది హాజరయ్యారు. 

రాజస్థాన్‌ శాసనసభలో 200 మంది ఎమ్మెల్యేలుండగా వాటిలో కాంగ్రెస్‌-107, బిజెపి-72, ఇతర పార్టీలు 7, స్వతంత్రులు 13 మంది ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 101 సీట్లు అవసరం ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 114 మంది ఎమ్మెల్యేలున్నట్లు లెక్క. సచిన్ పైలట్ చెప్పుకొంటున్నట్లు వారిలో 30 మంది తప్పుకొంటే గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ప్రస్తుతం సీఎల్పీ సమావేశంలో ఈ సమస్యపై చర్చ జరుగుతోంది. మరికొద్ది సేపటిలో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ప్రకటన చేయనుంది. 


Related Post