బిజెపి ఎంపీ అరవింద్‌ కాన్వాయ్‌పై టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి

July 13, 2020


img

బిజెపి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కాన్వాయ్‌పై ఆదివారం మధ్యాహ్నం టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు జిల్లాకు చెందిన ఇద్దరు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశం ముగించుకొని ధర్మపురి అరవింద్‌ తిరిగి వెళుతుండగా ఎమ్మెల్యేల అనుచరులు అక్కడకు చేరుకొని ఆయన కారును అడ్డగించి కోడిగుడ్లతో దాడి చేశారు. అప్పటికే అక్కడకు చేరుకొన్న పోలీసులు వారిని అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దాడికి పాల్పడిన ఆరుగురు టిఆర్ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

బిజెపి ఎంపీ విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఎమ్మెల్యే నన్నపూనేని నరేందర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండలోని బాలసముద్రం వద్ద మీడియా సమావేశం ఏర్పాటుచేయబోతున్నారనే విషయం తెలుసుకొన్న బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ  కార్యకర్తలు అక్కడకు బయలుదేరారు. కానీ పోలీసులు వారిని అడ్వకేట్స్ కాలనీలోనే అడ్డుకోవడంతో ఆమె తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసనలు తెలియజేశారు.     

గత ఏడాది నవంబర్‌లో కరీంనగర్‌ బిజెపి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమయాత్రలో పాల్గొన్నప్పుడు, ఓ పోలీస్ అధికారి ఆయనపై చెయ్యిచేసుకొన్నారు. ఆ ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరగా, ఎన్‌హెచ్ఆర్సీ తెలంగాణ హోం కార్యదర్శికి, డిజిపి మహేందర్ రెడ్డి, కరీంనగర్‌ పోలీస్ కమీషనర్‌కు నోటీసులు పంపి వివరణ కోరింది. ఆ ఘటనపై 1137/36/3/2019నెంబరుతో ఓ కేసు కూడా నమోదయింది. ఇప్పుడు టిఆర్ఎస్‌ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడికి పాల్పడటంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.


Related Post