మహబూబ్‌నగర్‌లో 650 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పంపిణీ

July 11, 2020


img

మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీరన్నపేట్‌లో ప్రభుత్వం నిర్మించిన 650 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ లబ్దిదారులను లాటరీ ద్వారా ఎంపికచేశారు. ఈ సందర్భంగా ఆయన లభిదారులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “త్వరలోనే మంత్రి కేటీఆర్‌గారి చేతుల మీదుగా మీ అందరికీ ఇళ్ళు అందజేయబడతాయి. మీ గ్రామంలో ఇళ్ళు లేని దళితులందరికీ, మైనార్టీలలో 12 శాతం మందికి ఇళ్ళు అందజేస్తున్నాము. రాష్ట్రంలో పేదవారందరికీ ఇళ్ళు ఏర్పాటు చేయాలనే సిఎం కేసీఆర్‌ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ పధకం నిరంతరంగా కొనసాగుతుంది. కనుక ఇప్పుడు లాటరీలో ఎంపిక కానివారికి మళ్ళీ తప్పకుండా అవకాశం వస్తుంది. కనుక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కోసం ఎవరూ బ్రోకర్లను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.       

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పధకం ఆశించిన స్థాయిలో జరుగడం లేదని చెప్పవచ్చు. సిమెంట్, స్టీల్ ధరలు నానాటికీ పెరుగుతుండటం, అవసరమైన చోట ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, ఇళ్ళ నిర్మాణం లాభసాటికాకపోవడంతో కాంట్రాక్టర్లు విముఖత చూపడం వంటి అనేక కారణాలున్నాయి. అయితే వందల కోట్లు ఖర్చుతో ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌ నడిబొడ్డున అత్యాధునికమైన క్వార్టర్స్ నిర్మాణం,  నియోజకవర్గాలలో క్యాంప్ కార్యాలయాలు, ప్రగతి భవన్‌, సచివాలయం, పార్టీ కార్యాలయాలు వంటివి  శరవేగంతో చకచకా నిర్మించబడుతున్నాయి కానీ నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి అన్నీ సమస్యలే. తలదాచుకోవడానికి చిన్న ఇల్లులేక పేదవారు దయనీయంగా జీవిస్తుంటే వారికి గూడు ఏర్పాటు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండాలి. కానీ వందలకోట్లు విలువగల భవనాలు కూల్చుకొని నిర్మించుకోవడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పిన టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిలో ఎన్ని పూర్తి చేసిందో ఇంకా ఎప్పటికీ పూర్తి చేస్తుందో తెలీదు. 


Related Post