అవుట్ సోర్సింగ్ నర్సులు ఏమి పాపం చేశారు?

July 11, 2020


img

సిఎం కేసీఆర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా కట్టడి గురించి ఎప్పుడు మాట్లాడినా, కరోనాపై ప్రత్యక్షపోరాటం చేస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందికీ మనం ఎంతో రుణపడి ఉన్నామని వారిని అందరూ గౌరవించాలని చెపుతుంటారు. వారిలో అవుట్ సోర్సింగ్ నర్సులు కూడా ఉన్నారని వేరే చెప్పక్కరలేదు. కానీ గత 10-15 ఏళ్లుగా ప్రభుత్వ నర్సులతో సమానంగా పనిచేస్తున్నా వారికి ప్రభుత్వం నెలకు రూ.15-17,000 జీతం మాత్రమే ఇస్తోంది. అదికూడా ప్రతీనెల అందుతుందనే గ్యారెంటీ లేదని చెపుతున్నారు. గత రెండునెలలుగా ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించకపోయినా కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ నర్సులు చెపుతున్నారు. 

ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, కరోనా రోగులకు సేవలు అందించేందుకు కొత్తగా నియమించబోతున్న నర్సులకు నెలకు రూ.25-28,000 జీతం ఇస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించడంతో అవుట్ సోర్సింగ్ నర్సులు భగ్గుమన్నారు. నర్సుగా 5 ఏళ్ళ అనుభవం ఉంటేనే వారికి హెడ్ నర్స్ పోస్ట్ ఇచ్చి నెలకు రూ.25-28,000 జీతం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దపడుతున్నప్పుడు, 10-15 ఏళ్ళు అనుభవం ఉన్న తమకు అంత తక్కువ జీతం ఎందుకు ఇస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్ల సీనియారిటీ ఉన్నతాము కొత్తగా వస్తున్న నర్సుల కింద సగం జీతానికే పనిచేయాలా?అని అవుట్ సోర్సింగ్ నర్సులు ప్రశ్నిస్తున్నారు. మేమేం పాపం చేశామని ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. 

గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ నర్సులు గత మూడు రోజులుగా కోఠీలోని డీఎంఓ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నారు. తమకు న్యాయం చేసేవరకు విధులకు హాజరుకాబోమని, అవసరమైతే ఉద్యోగాలకు రాజీనామాలు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. తమకు జీతాలు పెంచాలని కోరుతూ నాలుగు నెలల క్రితం ఆందోళన చేసినప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తమకు తప్పకుండా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని కానీ నేటికీ ఆ హామీని అమలుచేయకపోగా అసలు ప్రతీనెల సమయానికి జీతమే ఇవ్వడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.   

శుక్రవారం ఉదయం సుమారు 80 మంది అవుట్ సోర్సింగ్ నర్సులు డీఎంఓను కలిసి తమకు కొత్తవారితో సమానంగా జీతాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని కోరగా వారి డిమాండ్లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆయన స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వారు డీఎంఓ కార్యాలయం ఎదుట ధర్నా కొనసాగించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారీనందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

సకాలంలో జీతాలు అందకపోయినా తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ నర్సులను గౌరవించడం ఇలాగేనా?


Related Post